ఇంటర్నెట్‌డెస్క్ : వేలాదిమంది ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్ తాజాగా మరో 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తొలగించిన 200 మంది ఉద్యోగుల్లో ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. తాజా తొలగింపు జాబితాలో ట్విట్టర్ బ్లూ ఇన్‌ఛార్జిగా ఉన్న ఎస్తేర్ క్రాఫోర్డ్ కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్ అధినేత ఎలన్‌మస్క్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
కాగా, ఆర్థిక సంక్షోభంలో భాగంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్ వంటి టెక్ కంపెనీల మాదిరిగానే ట్విట్టర్ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ నెలలో ట్విటర్ 3,700 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా నివేదికల ప్రకారం ట్విట్టర్ సంస్థలో 2,300 మంది ఉద్యోగులున్నారు. అయితే ప్రస్తుతం తొలగించిన ఉద్యోగులతో ట్విట్టర్ కంపెనీలో కేవలం రెండువేల పై చిలుకు ఉద్యోగులే ఉంటారని తెలుస్తోంది.










