మతతత్వ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి 90వ దశకం చాలా కీలకమైంది. అద్వానీ రథయాత్రపై అప్పటికే దేశం అట్టుడుకుతోంది. ఈ రథయాత్ర తర్వాత బాబ్రీ విధ్వంసానికి దారి తీస్తుందని మొదట పెద్దగా ఎవరూ ఊహించి ఉండరు. కానీ, తెలుగునాట ఖాదర్ మొయినుద్దీన్ అనే కవి ఊహించాడు. అద్భుతమైన 'పుట్టుమచ్చ' అనే కావ్యానికి ఊపిరి పోసి ఇప్పటికీ తెలుగునాట వాక్యాలై వినిపిస్తున్నాడు.
1992 సంఘటన తర్వాత వచ్చిన అత్యంత ప్రభావవంతమైన కవుల్లో అజీద్ ఒకడు. ఇతను తాజాగా వేసిన కవితల పుస్తకం 'తురకవాడ' ఆ విషయాన్ని ఇట్టే చెప్పేస్తుంది. 1992 నుంచి 1994 దాకా ఒక ఉద్వేగపు వర్షం వంటి కవిత్వాన్ని, కవి కరీముల్లా మాటల్లో చెప్పాలంటే కణకణలాడే ఫకీరు డప్పులాంటి కవిత్వాన్ని రాసిన ఇతను ఆ తర్వాత ఎందుకు ఆగిపోయాడో అర్థం కాదు.
జీవితంలో స్థిరపడ్డం కోసం ఒక చిన్నపాటి ఇల్లయినా కొనుక్కుని నిలదొక్కుకోవడం కోసం తర్వాత చాలాకాలం పాటు కవిత్వం జోలికి వెళ్లలేదని ఇదే పుస్తకంలో కవి చెప్పుకున్నప్పటికీ ఎందుకనో మనలాంటివాళ్లకు అతను అలా ఆగాల్సింది కాదు అనిపిస్తుంది. కవిత్వమో.. జీవితమో .. తేల్చుకోవాల్సిన పరిస్థితులు అప్పట్లో అతని ముందు ఉండటం కూడా కొంత బాధ కలిగిస్తుంది. ఏది ఏమైనా 94 వరకు రాసినవి, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో రాసినవి ఒకటీ, రెండు కలిపి మొత్తం 30 నికార్సయిన కవితలతో వేసిన పుస్తకం 'తురకవాడ'.
2003ంలో నేను 'తురకోడి సేద్యం' అనే కథ రాస్తే అది తిట్టులా ఉందని దాన్ని 'రజాక్ మియా సేద్యం' అని పేరు మార్చి వేశారు ఓ పత్రికా సంపాదకులు. అప్పుడు అక్కడ తప్పిపోయిన తురకోడు అనే పదం ఇప్పుడు ఇక్కడ ఇలా కవితల పుస్తకానికి ఒక శీర్షికలా తలెత్తుకుని కనబడ్డం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ పుస్తకం బహిరంగంగా పట్టుకుతిరగడం కొంత ఇబ్బంది కదా.. అని కూడా అనిపించింది. అంతలోనే కవి అజీద్ ధైర్యానికి ముచ్చట కలిగింది. సాధారణంగా కవితల పుస్తకాల జోలికి వెళ్లని నాకు ఈ పుస్తకం మీద నాలుగు ముక్కలు రాయాలని కోరికను రగిలించింది.
దేశంలో 1990 కాలంలో ఉన్న పరిస్థితులే ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయని 'తురకవాడ' కవిత్వం చదివితే అర్థమవుతుంది. ఉన్నట్టుండి ఊళ్లో ఉన్న నాలుగిళ్లు 'తురకవాడ'గా ఎందుకు మారాయో, సాయిబయ్యా.. బూబమ్మ అంటూ ఆప్యాయతలు ఒలకబోసిన నోళ్లిప్పుడు ఎందుకు కాషాయ కబుర్లాడుతున్నాయో కవి స్పష్టంగానే చెబుతాడు ఇందులో. 'ఐదేళ్లకొకసారి జరిగే పండుగే నా పల్లెలో చిచ్చు పెట్టింది' అంటాడు. ఊళ్లలోకి మత రాజకీయాలు వచ్చిన తర్వాత సప్త వర్ణాలన్నీ ఒకే రంగుగా మారాయని ఆవేదన చెందుతాడు. అభివృద్ధి, వెనుకబాటు, అక్షరాస్యత వంటి వాటి పేర్లు చెప్పకుండా కేవలం మైనార్టీకి వ్యతిరేకంగా మెజార్టీని రెచ్చగొట్టి అధికారంలోకి రావొచ్చని సులభమైన మార్గాన్ని కనుగొన్న పాలకుల మీద, వారి ఎత్తుగడలకు సులభంగానే ప్రభావితమవుతున్న ఈ దేశ అమాయక జనం మీద జాలి కలిగి అంతలోకే దు:ఖం కలుగుతుంది.
మైనార్టీలు సొంత గడ్డపైనే పరాయీకరణ చెందుతున్న వైనాన్ని 'అద్దె బతుకు' కవిత వివరిస్తుంది. 'మకిలితనం లేని మనుషులకు, ఎవత్తోనో రంకుతనం అంటగట్టి, సరిహద్దుల ఆవలిదాకా తరమాలనే తుఫాన్ హెచ్చరిక తీరం దాటింది. అభద్రతా భయం భూతమై దేహాన్ని పట్టి పీడిస్తుంది' అంటాడు కవి.
మొన్న కరోనా దగ్గర్నుంచి ఇప్పటి రైలు సంఘటన దాకా ప్రతి దానికీ మైనార్టీలకు ముడిపెట్టి మీడియా, పాలకులు ఎలా వారిని కార్నర్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారో ఈ కవిత గుర్తు చేస్తుంది. రేపు ఇంకెక్కడైనా ఏదైనా జరిగితే దానితో ఏ సంబంధమూ లేకపోయినా ఏదో మూల ఒక అమాయకుడు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితులు ఈ దేశంలో ఎందుకున్నాయో స్ఫురణకు వస్తుంది. అజీద్ ఈ కాలానికి ఉండాల్సిన కవి. ఇతనికి భూత, భవిష్యత్ వర్తమాన విషయాల మీద పూర్తి పట్టుంది. పదునైన వ్యక్తీకరణ ఉంది. పాత్రికేయుడుగా కూడా ఉండటం వల్లనేమో తనదైన భాష ఉంది. అధ్యయనంతో కూడిన కవిత్వం రాయడం ఇతని ప్రత్యేకత.
''ఎన్నో వేల ఏళ్లనాటి, చెదలు బెట్టిన విశ్వాసాలను పూజిస్తూ, మనువు వారసత్వాన్ని భుజాన మోస్తున్న వృద్ధులు, ఐదారు శతాబ్దాల ప్రాయపు బిడ్డ నుదుట చరిత్రను తిరగరాయడం అన్యాయమే కదా! మధ్య ప్రాచ్యం నుంచి వలస వచ్చిన ఆర్యులు, రాయీ రప్ప, చెట్టూ పుట్టను దేవుళ్లుగా మార్చి, ఇక్కడే మహావృక్షాలుగా పాతుకు పోయినప్పుడు, మహమ్మదు పరాయివాడు ఎలా అయ్యాడు?'' అంటాడు.
ఇలాంటి సూటి ప్రశ్నలు కవిత్వంలో తుపాకీలా పేలినప్పుడు మన గుండె కూడా అదిరిపడుతుంది. ఇలాంటి వాక్యాలు నేను ఈ మధ్య కాలంలో ఎక్కడా చదవలేదు. నిజానికి 90ల కాలంలో వచ్చినంత నిక్కచ్చయిన వాక్యం ఇప్పుడు లేదేమో అనిపిస్తుంది. విపరీతమైన నిర్బంధం, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి, ప్రగతికాములకు వ్యతిరేకంగా తయారవుతున్న ప్రగతి వ్యతిరేక సమూహం దీనంతటికీ కారణం కావొచ్చు.
చరిత్ర నిండా ఉన్న వెలుగుని వదిలేసి ఎక్కడ ఏదో మూల అంటిన చీకటిని చూపిస్తూ వర్తమానంలో మొత్తం ఒక సమూహాన్నే దోషులుగా చూపిస్తున్న వైనాన్ని కవి 'కాఫిర్' కవితలో ఎండగడతాడు. 'మూడు రంగుల జెండా సాక్షిగా చెబుతున్నాను, నేనిక్కడ పుట్టినందుకు గర్విస్తున్నాను, అక్బర్లు... జహంగీర్లు.. కత్తులకు వందల నిఖాలు చేసిన, నేర చరిత్రకు నాకెలాంటి సంబంధమూ లేదు' అంటాడు.
ఏ గొడుగూ కింద లేకుండానే స్వతంత్రంగా ఉంటూ అడుగడుగునా కవితా ఫిరంగులు పేల్చే ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవదగ్గది. పుస్తకంలో నచ్చేవి ఏ రెండు కవితలో అయితే వాటి అంగాంగ వర్ణన చేసేవాణ్ని. పుస్తకమే నచ్చినప్పుడు వర్ణించడం మాని చదవమని కోరడం ఒక్కటే వివేకమైన పని అని తెలిసిన వాణ్ని... ఇంతకు మించి ఏం చెప్పగలను !
('తురకవాడ', కవితా సంపుటి, రచయిత : అజీద్, ధర : 125, పేజీలు : 100, ప్రతులకు : 92462 13493)
- వేంపల్లె షరీఫ్










