
ఈ ప్రపంచంలో అనేకనేక సంఘర్షణలను, సంక్షోభాలను, పోరాటాలను, ఉద్యమాలను 50 ఏళ్లుగా అత్యంత దగ్గరగా పరిశీలించిన, పరిశీలిస్తున్న కవి, రచయిత, సీనియర్ సంపాదకుడు 'నిజం' పేరుతో ప్రాచుర్యం పొందిన గార శ్రీరామమూర్తి. ఈ కవి చుట్టూ ఒక వలయం ఉంటుంది. ఆ వలయంలో అణగారిన వర్గాలకు జరిగే అన్యాయం, ఆధిపత్య కులాల పెత్తనం, వ్యాపార శక్తుల కుట్రలు, మతం మాటున ఎగిసిపడే మంటలు, అమానవీయ సంఘటనలు ... ఇవన్నీ ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు ఆయన కలం రంగంలోకి దిగుతుంది. మౌనాన్ని భగం చేస్తూ వెలుతురు వాక్యాలు ఉద్భవిస్తాయి. మనువాద కపట నాటకాలను తన కవిత్వ తెర మీద చూపుతూ, తెరలను భస్మం చేయాలనే చైతన్యపూరిత కర్తవ్యం కవిత్వీకరణగా కనిపిస్తుంది. గతి తార్కికత ఈ కవిత్వానికి సిలబస్. సమూహాన్ని ఎడ్యుకేట్ చేయడమే ఆయన పాఠం.
ఈ కవికి రెండు వైపులా కాదు అన్ని వైపులా పదును. ఒక వేటగాడు మృగాన్ని వేటాడే సందర్భంలో వుచ్చులు కడతాడు. ఎరలు వేస్తాడు. జాడలు కనిపెడతాడు. మాటు వేస్తాడు. వలలు పన్నుతాడు. కొన్ని సంకేతాలు పెట్టుకుంటాడు. ఈ కవి అలాంటి వ్యూహంతోనే ముందుకు వెళ్తాడు. కవిత రాస్తున్నప్పుడు నామవాచకం, విశేషాలను, క్రియను సంకేతాలుగా వాడతాడు. ఆ వాక్యాల వెంట పాఠకుడు నడుస్తున్నప్పుడు ఈ సంకేతాలను పట్టుకోవాలి. ''తెల్లగడ్డం ముళ్ల చట్టాల మాంత్రికుడు చేసే కుపరిపాలన ముద్రిస్తున్న పాఠ్యగ్రంథాలు' అనడం ద్వారా ఈ కవి ఫాసిస్టు రాజ్య ప్రభావాన్ని, స్వభావాన్ని చెబుతాడు. మన చుట్టూ విధించిన రెక్కలను విదిలించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించమంటాడు. ఒక్కోచోట బహిరంగంగా చెప్తాడు. ఇంకోచోట సంకేత సూచన చేస్తాడు. డిస్టర్బ్ అయిన సమూహాన్ని లోపల పెట్టుకుని కుట్రలను భగం చేయమంటున్నాడు. పూదోటలో సీసీ కెమెరా అనే కవిత నిర్మాణాన్ని పరిశీలిస్తే, ఎత్తుగడలో పువ్వుల్ని, మొగ్గల్ని, ఉద్యాన వనాల్లో ఉన్న పెళ్ళికాని జంటలను చూడడానికి కన్నొక్కటి ప్రత్యక్షమవుతుందని మొదలుపెట్టి ఒక సౌందర్యాత్మక వాతావరణాన్ని తీసుకొస్తారు. చివరికి వెళ్లేసరికి ప్రతి ఒక్కరి మనసులోనూ జైలొకటి లేచింది, లోపల బయట చిమ్మ చీకటి నిఘా ఉంది అని చెప్పి, సూర్యచంద్రులకు గూఢచర్య శిక్షణ ఇచ్చారు/ భూమ్యాకాశాలకు దొంగ కళ్లు, చెవులు అమర్చారు / పెగాసస్ కేసులో వీరు బొత్తిగా అమాయకులు. .. అంటాడు. ఈ ముగింపు పెగాసస్ అనే మూడు అక్షరాల దగ్గర కవి చెప్పదలుచుకున్న ఆంతర్యం అంతా దాగి ఉంది .
ఆయన కవితలు కొన్ని తలుపులు మూసుకుపోయినట్టుగా అనిపిస్తాయి. లోపలికి వెళ్తే మూసిన తలుపులకు సంబంధించి, తీయవలసిన తాళాలు కనిపిస్తాయి. ప్రాచీన అలంకారికుల్లో విశ్వేశ్వరుడు చమత్కార సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ కవిలో అప్పుడప్పుడు తొంగి చూసే చమత్కారం మనల్ని అలరిస్తుంది. అయితే అది తెచ్చి పెట్టుకున్న చమత్కారంగా అనిపించదు. ఆ వాక్యంలో ఆ పదంలో ఆ భావానికి చమత్కారం అవసరం అనుకుంటే కవి సహజంగా వాడినట్టే అనిపిస్తుంది. చమత్కారం కూడా అప్పుడప్పుడు సీరియస్‌గా సాగే భావ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అటువంటి ప్రమాదం ఈ కవిత్వంలో చాలా తక్కువగానే కనిపిస్తుంది. విరుద్ధాల్ని వాక్యంగా మలచడం కూడా ఈ కవికి ఉన్న ఒక బలం. కొన్ని సందర్భాల్లో భాష, అలంకార సౌందర్య సామగ్రి లేకుండా కూడా కవి వాక్యం నిర్మించాడు. ఏకకాలంలో హృదయాన్ని, మెదడుని కలగలిపి పాఠకుడిని ఆలోచింపజేసే సీరియస్ కవిత్వం వీరిది. ఒక పదునైన ఆలోచనతో, ప్రకంపనతో కూడిన ఉద్వేగంతో తర్కాన్ని కలిపి పాఠకుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేసే శైలి శ్రీరామమూర్తిలో కనిపిస్తుంది. నాలుగోపాదంలో ఉన్న కళ్ళు కవిత ఆయన కవిత్వ నిర్మాణ సామర్థ్యానికి మచ్చుతునక కాదు; మెచ్చు తునక.
నాలుగో పాదం కవితా సంపుటిలో కవిత్వ నిర్మాణానికి, బూడిద చెట్ల పూలు కవితా సంపుట్లోనే కవిత్వ నిర్మాణానికి ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. నాలుగో పాదం కవితా సంపుటిలో పొడి పొడి వాక్యాలు నిర్మాణం కనిపిస్తుంది. ముగింపుకి వచ్చేసరికి కవిత మొత్తం చేయవలసిన భావ ప్రసారాన్ని చేస్తుంది. బూడిద చెట్ల పూలు కవిత సంకలనంలో నిర్మానుష్యం అనే కవిత నిర్మాణాన్ని చూసినప్పుడు సుదీర్ఘమైన వచనం ఉన్నప్పటికీ మనల్ని చదివింపజేస్తుంది. పక్కా వచనరూపంలో ఉన్నా వాడిన భాష కవిత్వ ప్రవాహాన్ని వేగవంతం చేసింది. దీన్ని తమాషాగా నేను పరుగుపందెం శైలి అంటాను. ఈ పందెంలో కవి, పాఠకుడు ఇద్దరూ గెలుపు మజాను అనుభవిస్తారు. ఈ రచనా సంవిధానం పై అప్రయత్నంగానే ఆయన పట్టు సాధించినట్టుగా అర్థమవుతుంది. పరుగుపందెం శైలికి ఒక ఉదాహరణ.
'మనం ఎప్పుడో ఒకప్పుడు విడిపోతాం/ చెట్ల ఆకుల్లా, పూలరెమ్మల రాలిపోతాం/ జాడ లేని అడుగులమైపోతాం/ అయినా ఎవరికి వారం సచ్చరిత్ర భవనానికి యిటుకలుగా / నిలిచిపోవాలనుకుంటాం/ వొకటొకటి కలిసి బిందు సింధువుల బాంధవ్యమై మనిషి మంది అయి/ చైతన్యమైతేనే తీపి పులుపుల ద్రాక్ష తోట కదా!'
బూడిద చెట్ల పూలు కవితా సంకలనంలో 'వేవేల నేల' కవితలో నిజం గారి ఆత్మ దొరుకుతుంది. విరామ చిహ్నం అనే పేరుతో ఓ కవిత ఉంటుంది అది ఆయన ఆత్మ గుండా సాగే ప్రాణం. మురుగు వాసన వేసే అక్షరాల పూలబుట్టకు, ఒళ్లంతా గాయాలై అనారోగ్యం పాలైన వాతావరణానికి చికిత్స చేసే పనిలో ఆయన 24 గంటలు కవిత్వం అయిపోవడం మామూలు విషయం కాదు. దినకూలి రోజు పనికి వెళ్తే తప్ప బతకలేనట్టు, ఈ కవిత రాస్తే తప్ప ఊపిరి పీల్చలేని తనంలో ఉన్నట్టు ఆయన కవిత్వం చదివితే స్పష్టంగా తెలిసిపోతుంది.
కూడిక అనే కవితలో ఆయన ఏమన్నాడో చూడండి.. : ''వొక నువ్వు వొక నేను/ కొబ్బరికాయ దానిలో నీరు కాగలం/ జలమూ, జల పుష్పమై యీదగలం/ బండి, దాని చక్రమై పరాక్రమించగలం / వొక నువ్వు వొక నేను / చేదతాడై బావిని పారించగలం/ చేయి సమ్మెటై, కొలిమిని పనిముట్లను చేయగలం/ పొలాన్ని నిండు గోదాము గావించగలం/ యేకలింగ ప్రసవాలు ఒంటి చేతి చప్పట్లు / గాలిలేని కొమ్మల పూనకాలు / ద్రవం లేని ధారలు/ వొకే కుల వొకే మత జాతులే ప్రకృతి విరుద్ధాలు'' ఈ కవితకి శీర్షికని చూడకపోతే కాస్త మనకు అర్థం కానట్టే ఉంటుంది. శీర్షిక చూశాక ఈ కవిత సారం మొత్తం బోధపడుతుంది.
ఆయనలోని మరో కోణానికి క్లుప్తతకు నిదర్శనంగా నిలిచేవి అలలు. విమానపు రెక్కలతో దూసుకుపోయే కాలంలో నాలుగే నాలుగు పాదాలతో రసనను సంతృప్తి పర్చడం చిన్న విషయం కాదు. ఇందులో ఆయన అడుగడుగునా ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. అలలులో పదాలు ఆయన ఎలా చెబితే అలా ఉన్నాయి. రూపంలో పొట్టిగా ఉన్న ఇవి గట్టి కవితలు. ఇన్నేళ్లుగా కవిత్వం రాస్తున్న నిజం, కవిత్వం గురించి ఎక్కడైనా మాట్లాడారా? కవిత్వాన్ని ఆయన ఎలా చూస్తున్నారు? దీనికి సమాధానం అలలులో దొరికింది. ''ఆకలితో అల్లాడిపోయే అక్షరాలకు భావాల పాలు తాగించి గంతులేయించడమే కవిత్వం.'' అన్నారు. మరోచోట- ''మనసు ఊలుసంచిలో భద్రంగా దాచుకున్న/ చెకుముకి రాళ్లు తడిసిపోయాయి, భావాగ్ని నిద్దరోతోంది.'' అన్నారు. ''వాక్యాల నాగలి చాళ్లలో పండించే కవితలకు లోక రీతి జీవన తత్వాలే విత్తనాలు'' అంటారు మరొకచోట. ఈ కింది ఈ అలని గమనించండి. ఆయన ఏమి కలగంటున్నాడో చాలా స్పష్టంగా కవిత్వీకరణ చేశాడు.
''నీటి పొరలను ఒకటొకటిగా విప్పి చూడు, తడి తడి తడి/ గాలి హృదయాన్ని కవం పట్టి చూడు శ్వాస శ్వాస శ్వాస / వెలుగును వెయ్యి సార్లు ఉతికి చూడు వికాసం వికాసం వికాసం / దేవుళ్ళది ఎప్పుడూ సంహారం సంహారం సంహారం / వినాశకులను ఆరాధించే జాతి విలసిల్లదు. '' ఈ వాక్యాల్లో ఆయన టోన్ గమనించండి. ఒక జాతి తాలూకు సంకుచితత్వాన్ని ఐదు వాక్యాల్లో విప్పేశారు. ఆయన పొట్టి వాక్యం రాసినా, పొడుగు వాక్యం రాసినా, ప్రోజ్ రాసినా, పోయెట్రీ రాసినా, నర్మగర్భంగా చెప్పినా, అధి వాస్తవికతను ఎంచుకున్నా ఆయన దృక్కోణం మాత్రం స్పష్టం. ఆధునిక సమాజంలోని వైచిత్రిని, వైరుధ్యాలను పూర్తిగా అర్థం చేసుకొని వాటిని అధిగమిస్తూ స్వేచ్ఛ సమానత్వం అనే సారం వైపు ఈ కవి నడుస్తూనే ఉన్నాడు. అయితే, ఏ కవీ పరిపూర్ణం కానట్టే అక్కడక్కడ మనకు ఈ కవితల్లో కూడా కొన్ని లోపాలు గమనించవచ్చు. సమాజంలో జరిగే అమానవీయ, అమానుష సంఘటనలకు కవిత్వం రాస్తున్నప్పుడు కవులు సాధారణీకరించి మాట్లాడటం, అందరికీ ఆపాదించడం సరైన పద్ధతి కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. నాలుగో పాదం సంకలనంలో ఎడారి అనే కవిత ఉంటుంది. ఆ కవిత ముగింపు దగ్గరకు వచ్చేసరికి 'సమాజ బీజం మొలవని మంచి మచ్చుకైనా నిలవని చవుడు భూమి' అని ముగించారు. దీనికి నేను వ్యాఖ్యానం చేయను. ఇలాంటివి అక్కడక్కడ ఉన్నాయి. సమూహాన్ని సమాజాన్ని పూర్తిగా మార్చడం అనే ప్రాతిపదిక మీద నిజం కవిత్వం నిలబడి ఉంది. భాష మీద ఆయనకు అపారమైన పట్టు ఉందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే భాషా వ్యామోహం కొన్నిచోట్ల మనల్ని ఇబ్బంది కూడా పెడుతుంది. తన సాహిత్యాన్ని ఏ తాత్విక దృక్పథం నుంచి మొదలు పెట్టాడో, దాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా సాగుతూనే ఉన్నారు. పాలకవర్గాల భావజాలం పట్ల అడుగడుగునా పాఠకుడిని అప్రమత్తం చేస్తున్న కవి నిజం.
- డాక్టర్ సుంకర గోపాల్
94926 38547