- వందలాది మంది పేదలకు అన్నదానం
ప్రజాశక్తి-అనంతపురం : స్వతంత్ర సమరయోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు వీకే ఆదినారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వీకే ఆదినారాయణ రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం వందలాది మంది పేదలకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వీకే రంగారెడ్డి, తోటపల్లి నారాయణరెడ్డి, వై మధుసూదన్ రెడ్డి, మొగలి సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి, విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ గోవింద రాజులు ఎల్‌ఐసి తిరుపతయ్య, తలారి రామాంజనేయులు, పతకమూరు నాగరాజు రేపటి రామాంజనేయులు , ప్రదీప్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి లక్ష్మి నారాయణ ఇతర కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీకే ఆదినారాయణ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు త్రాగు నీరు,సాగునీటి సాధన కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 10 టీఎంసీల నీరును అనంతపురం జిల్లాకు కేటాయించాలని.. అలాగే అనంతపురం జిల్లాను ఎడారి ప్రాంతం కాకుండా కాపాడాలని.. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. కరవు పీడితమైనటువంటి రాయలసీమ జిల్లాల విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలంటూ సాగిన పోరాటాలను వారు గుర్తు చేసుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు నేటికీ అందరికీ గుర్తున్నాయన్నారు. ఆయన ఎంతో మందిలో ఉద్యమ స్ఫూర్తి రగిల్చారని.. ఆయన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.










