ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలో వేసవి దృష్ట్యా ఎక్కడా సమస్య తలెత్తకుండా దృష్టి సారించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అధికారులను ఆదేశించారు. నగరంలోని 39వ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్‌లో గురువారం నగర మేయర్ మహమ్మద్ వసీం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమకు నీటి సరఫరా సరిగా జరగడం లేదని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ సమస్యను అధికారులను అడిగి తెలుసుకొగా పాత పైప్ లైన్ సరిగా లేకపోవడం వల్ల నీటి సమస్య తలెత్తుతోందని మేయర్‌కు వివరించారు. కొత్తగా వేసిన పైప్ లైన్ ద్వారా వెంటనే నీటి సరఫరా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నగరంలో కూడా ఎక్కడా నీటి సమస్య లేకుండా చూడాలని, ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. మేయర్ వెంట కార్పొరేటర్ ఇషాక్,వైసీపీ నాయకులు మధు,ఖాజా,మధు,డిఈ లు నరసింహులు, రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










