- నమ్మించి మోసం చేసిన అధికారులు
- చిలమత్తూరులో పేదల గుడిసెలు తొలగింపు
ప్రజాశక్తి-చిలమత్తూరు : భూస్వాధీన పోరాటంపై రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశారు. ఇళ్ల పట్టాలిస్తామని నమ్మించి రెండు రోజులకే గుడిసెలను కూల్చివేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. గత 20 రోజులుగా శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఇళ్ల పట్టాల కోసం సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో పేదలు భూస్వాధీన పోరాటం నిర్వహిస్తున్నారు. కోడూరు రెవెన్యూ పొలం 805 సర్వే నెంబర్‌లో కొట్టాలు వేసుకుని అక్కడే నివాసముంటున్నారు. రెండ్రోజల క్రితం వీరందరికీ పట్టాలు ఇస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ఈ హామీని తుంగలో తొక్కి పేదలకు నమ్మకం ద్రోహం చేసే చర్యలను అధికారులు చేశారు. గురువారం వేకువజామున సుమారు వంద మంది పోలీసులు జెసిబిలో 805 సర్వే నెంబర్‌లోకి చొరబడ్డారు. పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేశారు. అడ్డుపడ్డ పేదలు, సిపిఎం నాయకులను బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణ రహితంగా ఈడ్చకుంటూ వారిని లారీల్లోకి ఎక్కించారు. సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్, అధ్యక్షుడు లక్ష్మినారాయణ, సిఐటియు జిల్లా నాయకులు రమేష్, కమిటీ సభ్యులు శివ, రహంతుల్లా, చరణ్, నరసింహా, సదాశివరెడ్డి, రాజు, మంజు, మహిళలను అరెస్టు చేసి చిలమత్తూరు, లేపాక్షి పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో పలువురు మహిళలకు గాయాలు సైతం అయ్యాయి. గుడిసెల్లో పేదలు ఏర్పాటు చేసుకున్న మంచాలు, వస్తువులు, నిత్యావసరాలను చిందరవందర చేశారు. పోలీసులు, అధికారుల తీరుపై సిపిఎం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ చిలమత్తూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం ఇంతియాజ్, వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిఎల్ నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడూతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చేతులు రావడం లేదన్నారు. శాంతియుతంగా పోరాడుతున్న పేదలపై ఈ రకమైన బలవంతపు దాడులు చేసే విధానాలు సరికాదని విమర్శించారు. పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించడం, పేదలను కొట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాటల్లో చెబుతున్నారని, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తున్నారని విమర్శించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు ఈ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.










