
- కర్నూలులో ప్రారంభించిన జస్టిస్ కృష్ణమోహన్
ప్రజాశక్తి-కర్నూలు లీగల్ :వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి,కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఆకాంక్షించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కర్నూలులో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రిబ్యునల్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, వీటికి అదనంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కూడా చేరిందన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, సంబంధిత అంశాలలో సమర్థవంతంగా న్యాయం అందించాలన్నదే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ లక్ష్యమని తెలిపారు. అందరి సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి, కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎఎండి. ఇంతియాజ్, జిల్లా కలెక్టర్ జి.సృజన, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రిబ్యునల్ ఛైర్మన్ జి.భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.