ఉపముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు : సిపిఎం నేత డి.వెంకన్న
దేవరాపల్లి (అనకాపల్లి) : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి డిప్యూటీ సిఎం సొంతనియోజకవర్గంలో నేటికీ గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న పేర్కొన్నారు. శనివారం డి.వెంకన్న ఓ ప్రకటన విడుదల చేశారు. దేవరాపల్లి మండలంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత వాలాబు పంచాయతీలోని స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ సర్పంచ్ ని ఎన్నికల్లో గిరిజనులు ఓడించారన్న నెపంతో పంచాయతీలో గిరిజనుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తూ పంచాయతీ అభివృద్దికి ఒక్క రూపాయి కూడ ఖర్చు చేయలేదన్నారు. కేటిపాలెం, బోర్రచింత, రామాన్నపాలెం, కోడాపల్లి పూలగరువు, బుచ్చంపాలెం, నగరంపాలెం, తాడిపూడి, కించుమండ, బోడిగరువు, నెరెళ్ళపూడి, మదనగరువు, వీరబంద్రిపెటలో కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. చీడికాడమండలంలోని వీరబద్రపేట వరకు తారురోడ్డు వేసి జయపురం ముడిచర్ల, కోండింపూడి, గోప్పూరు వరకు రోడ్డు వేయకుండా వదిలిపెట్టారని తెలిపారు. చేరుగుబల్లి, మళ్ళపాడు, జాజులపాలెం, గోడుగుమామిడి, రెళ్ళలపాలెం, కోత్తవీది, బందవీది, కోండవీది గ్రామాలకు రోడ్లు లేవన్నారు.
మాడుగులం మంండలోని మామిడిపాలెం, చినబోడ్డరేవు, అనందపురం, లక్ష్మీపురం, అజయ్ పురం, కోండవీది, చినపిట్టగెడ్డ, రాసగోప్పూరు, సిరిపురు, కామకోటం, వీరనారాయణంకొండవీది, చినగోర్రిగెడ్డ, పెదగోర్రిగెడ్డ, పసువులలుబంద, జోగంపేట, రాయిపాలెం, శంకరంగోప్పూరు, బుట్లజాలంపల్లి గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది గిరిజనులు డబ్బులు కూడబెట్టుకొని సొంతగ్రామాలకు రోడ్లు వేసుకుంటున్నారని తెలిపారు. వైసిపిని గెలిపిస్తే తమ గ్రామాలకు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన గిరిజనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. మంత్రి అవ్వాలన్న తన కోరిక నెరవేరిందని గిరిజనుల కోరికలు మాత్రం తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు ఎక్కువ ఉన్న చోటనే రోడ్లు వేయడం, ముఖ్యంగా అధికార పార్టీ సర్పంచ్‌లు ఉన్న వద్ద మాత్రమే అభివృద్ధి పనులు కొంతమేరకు చేస్తున్నారని, మిగిలిన గ్రామాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించాలని, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని వెంకన్న కోరారు.










