ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి జిల్లా):అదో మారుమూల గ్రామం. సరైన రహదారి సౌకర్యంలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు పడిన రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టకున్నా ఫలితం లేకపోవడంతో మహిళలే నడుము బిగించారు. తమ రోడ్డుకు తామే స్వయంగా మరమ్మతులు చేసుకున్నారు. పట్టుదలతో కఅషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసి చూపించారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో శనివారం చోటు చేసుకుంది. మోర్త - పెరవలి ఆర్‌అండ్‌బి రహదారిలోని తాడిపర్రు ఒకటో వార్డులో రోడ్డుకు పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. ఈ గుంతల్లో పడి అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. గుంతలకు మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఏడాది కాలంగా స్థానిక ప్రజలు కోరుతూనే ఉన్నారు. రోడ్డు మరమ్మతు కోసం రూ.40 వేలు మంజూరు అయ్యాయని, నిధులు లేకపోవడంతో పనులు ప్రారంభించడం లేదని సంబంధిత శాఖ ఎఇ చెప్పారు. దీంతో ఒకటో వార్డుకు చెందిన మహిళలు అక్కిన రత్నం, అక్కిన పద్మ, అక్కిన సత్యవతి, అక్కిన పద్మావతి, అక్కిన విశాల, అక్కిన చిన్నమ్మ, జజ్జవరపు సీతారత్నం, పండితారాధ్యుల వీరభద్ర గిరిజ, పొట్లచెరువు పద్మావతి, తదితర మహిళలు వ్యక్తిగతంగా వారే డబ్బులు వేసుకుని గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు నిధులను వెచ్చిస్తున్నా..రహదారులకు అవసరమైన నిధులను కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. అందుకే ప్రయాణికుల బాధలను తీర్చేందుకు తామే డబ్బులు వేసుకుని రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు.