ఓ పక్క
దేశ విజ్ఞానం
భూఉపరి తలం దాటి,
విను వీధుల్లోంచి దూసుకుంటూ
జాబిల్లికి చేరిపోతోంది!
మరోవైపు అజ్ఞానం
తల నుండి మోకాలికి
అక్కడ నుంచి అరికాలికి జారి,
వనితల్ని వివస్త్రలు చేసి,
వీధుల్లో ఊరేగిస్తూ పైశాచికమవుతోంది!
చంద్రయాన్ విజయానికి
ఉప్పొంగిపోవాలా?
మానవత్వాలు మసకబారుతున్న
ఈశాన్య ఊచకోతలకు
కుంగిపోవాలా?
వాళ్ల వైరుధ్యం
మతమో? తెగో? కావచ్చు!
అలాని, ఏకంగా
తలలే తెగాలా?!
ఎవరి పట్టు కోసమో?
ఆకుపచ్చని నేలపై
నెత్తుటి మరకలు చిందాలా?!
అమాయక గిరిజనం
బలిదానాలు కావాలా?
అడవి బిడ్డల్లో
అలజడులు రేపి
మానభంగాలు చేసేసి
ఊపిర్లు తీసేశాక కూడా
వాళ్లని మనుషులనుకుంటే పొరబాటే!
పరవశించే ప్రకృతిని
పొరుగు దేశాలు
పర్యాటక ప్రగతిగా మార్చుకుంటుంటే !
మణిపూర్‌లో మంటలు సృష్టించి
రాజకీయ లాభాలకు
యోచించే ఈ కుహనా వ్యూహకర్తలు
నిస్సందేహంగా దేశద్రోహులే !
- చిలుకూరి శ్రీనివాసరావు










