Aug 03,2023 06:05
  • రేపు జిల్లా కేంద్రాల్లో నిరసన
  •  యుటిఎఫ్‌ పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. యుటిఎఫ్‌ కార్యాలయంలో ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడారు. జూన్‌ 12 నాటికి బదిలీలు, జూన్‌ 25 నాటికి వివిధ కేడర్ల ప్రమోషన్లు పూర్తయినా ఇప్పటికీ బదిలీలైన ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించలేదని అన్నారు. కేడర్‌ స్ట్రెంగ్త్‌ అప్‌డేట్‌ చేస్తున్నామనే పేరుతో చెల్లించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించామని చెప్పిన విద్యాశాఖ, జీతాలు సకాలంలో చెల్లించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. ఉపాధ్యాయులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ జూన్‌, జులై నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీతాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఆగస్టు 4న సాయంత్రం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ సహాధ్యక్షులు కె సురేష్‌కుమార్‌, ఎఎన్‌ కుసుమకుమారి, కార్యదర్శులు బి లక్ష్మిరాజా, బి సుభాషిణి, టి అన్నారాము, ప్రచురణ విభాగ ఛైర్మన్‌ ఎం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

జీతాలు లేకపోతే ఎలా? : ఎస్‌టియు

బదిలీలు పొందిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోతే ఎలా అని ఎస్‌టియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌ సాయిశ్రీనివాస్‌, హెచ్‌ తిమ్మన్న ప్రశ్నించారు. ఈ మేరకు రాష్ట్ర ఖజానా కార్యాలయం డైరెక్టర్‌ ఎన్‌ మోహన్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 4న సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

బాధ్యతా రాహిత్యం : ఎపిటిఎఫ్‌

బదిలీలు జరిగి రెండు నెలలు అవుతున్నా.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వం బాధ్యతా రాహిత్యమని ఎపిటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి ఒక ప్రకటనలో విమర్శించారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు.