Aug 07,2023 10:57

కరాచీ : పాకిస్తాన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 33 మంది మరణించగా, 80 మంది గాయపడ్డారు. అక్కడి మీడియా కథనం ప్రకారం, షాజాద్‌పూర్‌ , నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని నవాబ్‌షాలోని పీపుల్స్‌ మెడికల్‌ హాస్పిటల్‌లో చేర్చారు. రైలు పట్టాలు తప్పడానికి కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాదం తర్వాత సమీపంలోని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌ను అమలు చేశారు. దెబ్బతిన్న బోగీల నుంచి ఇప్పటి వరకు 33 మంఇ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పాకిస్తాన్‌ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్‌ మహమూద్‌ రెహ్మాన్‌ ధ్రువీకరించారు. రైలు వేగం అంతగా లేదని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఆ మార్గంలో వెళ్లే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు రైల్వే అధికారులు చెప్పారు.