ప్రజాశక్తి- జామి (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా అలమండ రైల్వే స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం మరవక ముందే పుదుచ్చేరి నుంచి హౌవ్‌డా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పొగలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ప్రయాణికుల కథనం ప్రకారం... అలమండ స్టేషన్ పరిధిలో భీమసింగి రైల్వే బ్రిడ్జిపైనుంచి వెళ్తున్న పుదుచ్చేరి-హౌవ్‌డా ఎక్స్‌ప్రెస్ ఎసి బోగీ నుంచి పొగలు రావడాన్ని స్థానిక పశువుల కాపరి పద్మనాభం గమనించి పెద్దగా కేకలు వేసి అప్రమత్త్తం చేశారు. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికులు ట్రైన్ చైను లాగి రైలును ఆపారు. రైల్వే సిబ్బందికి విషయం తెలియజేశారు. వారు వచ్చి పరిశీలించి బ్రేక్ బెండింగ్ (బ్రేక్ వేసినప్పుడు వేడి పెరగడం) వల్ల పొగలు వచ్చాయని, ఎలాంటి ప్రమాదమూ లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బ్రిడ్జిపై రైలు అరగంటపాటు నిలిచిపోయింది.