మాడుగులపల్లి: రైలు పట్టాలపై ట్రాక్టర్ నిలిచిపోవడంతో నల్గండ జిల్లాలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. మాడుగులపల్లికి చెందిన చెన్నయ్య ట్రాక్టర్‌లో కట్టెలు తీసుకుని పట్టాలపై నుంచి అవతలికి దాటేందుకు యత్నించాడు. ఇంతలో ట్రాక్టర్ ట్రాలీ చెరువుపల్లి వెళ్లే మార్గంలో పట్టాలపై ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు.అదే సమయంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ట్రాక్టర్ ట్రాలీ నిలిచిపోయిన విషయాన్ని అప్పటికే రైల్వే అధికారులకు తెలియజేయడంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వేస్టేషన్‌లో నిలిపేశారు. అనంతరం జేసీబీతో ట్రాక్టర్‌ను తొలగించారు. రైలు ఆగిపోవడంతో అరగంట సేపు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.