సహజంగా పార్కు కు వెళితే అక్కడ ఉయ్యాల, జారుడు బండ, బాస్కెట్‌బాల్, అవుట్‌డోర్ బౌలింగ్, ఫ్రిస్బీ,....ఇలా ఎన్నో చిన్న పిల్లలకు మాత్రమే గేమ్స్ ఆడుకునేలా ఉంటాయి. కాని బెంగుళూరులో జెపి నగర్‌లో ఓ బహిరంగ ప్రదేశంలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆడుకునేలా బోర్డు గేమ్‌లు ఉన్నాయి. అవి మరుగున పడిపోయిన పురాతన ఆటలు కావడం విశేషం. చరిత్రను ఆధారంగా సుమారు 500 వందల బోర్డు గేమ్‌ల తయారీకి శ్రీరంజని శ్రీకారం చుట్టారు. వాటి కోసం ఆమె చేసిన కృషి, రీసెర్చ్‌కి అందరూ ప్రశంసిస్తున్నారు.

ఆటలు అంటే మానసిక, శారీరక ఆనందాన్ని ఇచ్చేవి. దాంతో మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే ఇప్పుుడు ఆడుతున్న ఆటలంతా సాంకేతికత, ఇంటర్నెట్ ప్రపంచంలో పిల్లలు ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌లతో గడుపుతున్నారు. దాంతో పిల్లలు రేడియోషన్‌కు గురై రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకే బెంగుళూరుకు చెందిన శ్రీరంజని పురాతన కాలంనాటి ఆటలను తిరిగి జనంలోకి తీసుకువచ్చారు. ఆమె అప్లైడ్ జెనెటిక్స్‌లో మాస్టర్స్ చేశారు. ఓ రోజు శ్రీరంజని ఇంటి బయట కూర్చున్నారు. అపార్టుమెంట్లో నివాసం ఉన్న జనం సాయంత్రం వేళల్లో బయట కూర్చున్నప్పుడు చిన్నారులు, యువతీయువకులు, వృద్ధులు అంతా కలిసి సరదాగా ఆడుకోదగ్గ ఆటలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో శ్రీరంజనికి ఓ ఆలోచన కలిగింది. పాత రోజుల్లో గ్రామాల్లో అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు, చుట్టు పక్కల జనంతో కలిసి ఓ దగ్గర కూర్చొని పులి, మేక, ఆష్టాచెమ్మా, వామనగుంటలు...ఇలా రకరకాల ఆటలను ఆడుకునేవారు. అవి మనుషుల మధ్య పోటీతత్వంతో పాటు సామరస్య సంబంధాలు మెరుగుపడేలా ఉండేవి. వాటిని మళ్లీ తీసుకురావాలన్న ఉద్దేశంలో బొమ్మల తయారీదారులతో కలిసి మాట్లాడారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ యొక్క ఇండిస్టియల్ డిజైన్ ఫ్యాకల్టీతో కలిసి పనిచేసిన ప్రొఫెసర్ సుదర్శన్ ఖన్నాను కలిసి తమ ఆలోచన పంచుకున్నారు. శ్రీరంజని తీసుకురావాలనుకున్న బోర్డు గేమ్‌ల ఆలోచన ఆయనకు ఎంతో నచ్చింది. ఆయన ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు తయారీకి పూనుకున్నారు.
చరిత్ర ఆధారంగా
తరాలు మారుతున్న కొద్ది చరిత్రలో జరిగిన సంఘటనలతో పాటు ఆటలు కూడా కనుమరుగవుతున్నాయి. అవి తెలుసుకునేందుకు శ్రీరంజని రాజుల కాలంనాటి పుస్తకాలను చదివారు. ప్రాంతాలకు తగ్గట్టుగా చరిత్ర పుస్తకాలను వెతికారు. ఆ ఆటలు ఆడిన మునుపటి తరం వ్యక్తులతో కలిసి మాట్లాడారు. సాంప్రదాయ బోర్డ్ గేమ్‌ల నిధిగా ఉన్న చారిత్రాత్మక దేవాలయాలు, స్మారక చిహ్నాలను కూడా సందర్శించారు. దేవాలయాల నేలపై చెక్కబడి ఉన్న అనేక ఆటలను కూడా ఆమె కనుగొన్నారు. రాజవంశీకులు, పూజారులు, సామాన్యులు ఆడే విధంగా వినోద సాధనాలు గుళ్లపై చెక్కబడ్డాయి. బేలూరు, హళేబీడు, శ్రావణబెళగొళ, హంపి, సోమనాథపుర, చాముండి కొండ, హోయసల దేవాలయాలు తిరిగారు. బాదామి గుహలు, బనవాసి, పట్టడకల్‌లతో పాటు అర్కేశ్వర దేవాలయాల్లో పురాతన బోర్డు ఆట నమూనాలు కనుగొన్నారు. మధ్యయుగ యుగాల్లో, మొఘల్ రాజులు అనేక బోర్డ్ గేమ్‌లను ఆడేవారని తెలుసుకున్నారు. పంచ కేలియా, పచ్చిసి, దాష్ గుటి, అలిగులిమనే, పగాడేగా పిలవబడే ఆటలు చాలానే ఉండేవి. వాటిలో సుమారు 500 ఆటలను సేకరించారు శ్రీరంజని.

పర్యావరణ అనుకూలంగా
గుప్త సామ్రాజ్యంలో, అక్బర్ న్యాయస్థానం వంటి విశిష్టిత, వారి జీవిత చరిత్రలు ప్రస్ఫుటిల్లేలా చెక్క ముక్కలను తయారు చేయించారు. అందుకు హస్తకళాకారుల సహకారం తీసుకున్నారు. పర్యావరణ అనుకూల డిజైన్లు, రంగులను వాడారు. సహజసిద్ధ పదార్థాలను ఉపయోగించి చేతితో చేయబడ్డ రాతితో బోర్డులన్నీ సృష్టించారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లోని 12 క్రాఫ్ట్ క్లస్టర్‌లతో కలిసి ఈ డిజైన్లు తయారు చేశారు. దీని ఫలితంగా కలంకారీ డిజైన్‌లు, గోండ్ ఆర్ట్, లంబానీ ఎంబ్రాయిడరీ, చెన్నపట్న చెక్కపని, కాన్వాస్ మెటీరియల్‌తో ఆటల నమూనాలను తయారు చేయించారు. ఆడు హులి (మేకలు, పులులు), అలిగులిమనే (ఒక మంకాల ఆట), చౌకబార (రేసు గేమ్) ఇతర ఆటలను తయారు చేయించారు. ఈ పూర్వకాలం ఆటలన్నీ సామాజిక పరస్పర చర్యలను పెంచేందుకు దోహదపడతాయి. ఏకాగ్రతను, పట్టుదలను పెంచేలా, ఆలోచన సరళీ మెరుగుపడేలా, మతిమరుపు తగ్గించేలా చేస్తాయని శ్రీరంజని అంటున్నారు.
అందరూ ఆడుకునేలా
ఈ సాంప్రదాయ బోర్డు గేమ్‌లు కుటుంబంలో అందరూ ఆడుకునేలా ఇళ్ల మధ్య, బహిరంగ ప్రదేశాల్లోనూ పెట్టుకునేలా అనుకూలంగా ఉంటాయి. బెంగుళూరులో ఓ బహిరంగ ప్రదేశంలో ఈ బోర్డులను అక్కడక్కడ అవుట్‌డోర్ ఇన్‌స్టాలేషన్‌ల్లో, రాతి బెంచీలు మరియు టేబుల్‌లపై ఆటలు చెక్కబడి ఉంటాయి. ఇవి చాలా కాలం పాటు ఉంటాయి. వాటిని చుట్టుపక్కల ఎవరైనా ఆడవచ్చు. పాఠశాలలు, అపార్ట్‌మెంట్ లేఅవుట్లు, కార్యాలయాల్లో ఉంచారు శ్రీరంజని. దాంతో నగరంలో పిల్లలు, వృద్ధులు గ్రూపులుగా వస్తున్నారు. ఎంతో ఆనందంగా ఈ బోర్డుల ముందు కూర్చొని వినోదాత్మకంగా ఆడుకుని ఇళ్లకు వెళుతున్నారు. ఈ ఆటల వల్ల పాత స్నేహ పూర్వక పరిచయాలు పెరిగాయని సీనియర్స్ అభిప్రాయాలు వ్యక్త పరిచారు. పిల్లలు మాత్రం ఫోన్ ఆలోచన నుంచి బయటపడుతున్నా మంటున్నారు. దాంతో ప్రతి ఒక్కరూ శ్రీరంజని చేసిన ఈ బోర్డు గేమ్‌ల ప్రయత్నాన్ని హర్షిస్తున్నారు.










