ప్రజాశక్తి-ఆచంట ( పశ్చిమగోదావరి జిల్లా) : సాంప్రదాయ, గ్రామీణ క్రీడలను విద్యార్ధులు, యువత పరిరక్షించాలని ఆచంట ఎస్సై బి.ఎస్.డి.ఆర్ ప్రసాద్, డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు యస్.వీ.యన్ శర్మ అన్నారు. సంక్రాంతి యువజనోత్సవాల సందర్భంగా ... డి.వై.ఎఫ్.ఐ, జై భీమ్ యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ఆటలపోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలి పంచాయతీ పరిధి వర్ధనపుగరువు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న ప్రాధమిక పాఠశాల ఆవరణ వద్ద బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ప్రపంచీకరణ ప్రభావంలో యువత ఆన్ లైన్ క్రీడలకు, పేకాట, గుండాట, జూదం, కోడిపందాలులాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారని అన్నారు. యువత, విద్యార్ధులకు మానసిక, శారీరక ధృఢత్వం కోసం శ్రమ కలిగించే ఆటలలో భాగస్వాములు కావాలన్నారు. యువతను పెడితోవ పట్టించే విష సంస్కృతికి ప్రత్యామ్నాయంగా డి.వై.ఎఫ్.ఐ, జై భీమ్ యువజన సంఘాలు క్రీడా పోటీలు నిర్వహించండం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముగ్గులు, పరుగు పందాలు, మ్యూజికల్ ఛైర్స్, కుండకొట్టుడు, తదితర ఆటలపోటీలలో గెలుపొందిన విజేతలకు ఎస్సె ప్రసాద్, పెనుమంచిలి గ్రామ సర్పంచ్ గణేశుల శేషవాణి, సుబ్బారావు, మాజీ సర్పంచ్ వర్ధనపు నవమోహిని, తదితరులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.వై.ఎఫ్.ఐ నాయకులు సిర్రా నర్సింహమూర్తి, మానుకొండ రాంబాబు, జై భీమ్ యువజన సంఘం నాయకులు అల్లూరి చిన్నారావు, వర్ధనపు హరికృష్ణ, విశ్రాంత ఉపాధ్యాయులు వర్ధనపు నాగేశ్వర్రావు, సిర్రా విఘ్నేశ్వర్రావు, ఎమ్.వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.










