లండన్ : కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడి హత్యపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు భారత్‌తో సాగుతున్న తమ వాణిజ్య చర్చలను ప్రభావితం చేయబోవని బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
భారత్-బ్రిటన్ సంబంధాలను ఈ అంశం ప్రభావితం చేస్తుందా అని ప్రధాని రిషి సునాక్ ప్రతినిధిని ప్రశ్నించగా, కెనడా అధికారులతో బ్రిటన్ టచ్‌లో వుందని చెప్పారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్‌కు సంబంధాలున్నాయని వచ్చిన 'విశ్వసనీయమైన ఆరోపణలు'ను పరిశీలిస్తున్నామని సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయు ప్రకటన చేసిన నేపథ్యంలో కెనడా, భారత్ దౌత్యవేత్తను బహిష్కరించింది.
కాగా కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలను ''అసంబద్ధమైనవి, దురుద్దేశపూరితమైనవి''గా పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ మంగళవారం వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కెనడా అధికారుల దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ దశలో దీనిపై మరింతగా వ్యాఖ్యానించడం సముచితం కాదని బ్రిటన్ ప్రతినిధి పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే భారత్‌తో తమ వాణిజ్య చర్చలపై కసరత్తు సాగుతుందన్నారు. చారిత్రకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా కృషి చేయాలని ఈ నెల ఆరంభంలో భారత్, బ్రిటన్‌లు నిర్ణయించాయి.