Sep 17,2023 11:11

లండన్‌ : ప్రతిపాదిత వీసా ఫీజు పెంపు అక్టోబరు 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆరు మాసాల్లోపు విజిట్‌ వీసాకు ప్రస్తుతమున్న ధర కంటే 15 యూరోలు ఎక్కువ ఖర్చు అవుతుంది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వచ్చే పర్యాటకులకు విద్యార్థి వీసాలు 127యూరోలు పెరగనుంది. ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లును శుక్రవారం ప్రవేశపెట్టారు. కొత్త చార్జీల ప్రకారం ఆరు మాసాల్లోపు విజిట్‌ వీసాలకు వ్యయం 115యూరోలు కాగా, బ్రిటన్‌కు వెలుపల నుంచి వచ్చే విద్యార్ధి వీసాకు దరఖాస్తు ఫీజు 490 యూరోలకు పెరగనుంది. దేశ ప్రభుత్వ రంగ వేతన పెంపును ఎదుర్కొనేందుకు వీసా దరఖాస్తుదారులు చెల్లించాల్సిన ఫీజును గణనీయంగా పెంచుతున్నట్లు జులైలో ప్రధాని రిషి సునాక్‌ ప్రకటించారు. విద్యార్ధుల ఫీజులు, నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌కి చెల్లించే ఆరోగ్య సర్‌ఛార్జీలు పెరుగుతాయని తెలిపారు. ఈ దేశానికి వచ్చే వలసదారులు వీసాల కోసం, ఇమ్మిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌ఛార్జి (ఐహెచ్‌ఎస్‌) కోసం చెల్లించే చార్జిలు పెంచుతున్నట్లు చెప్పారు. వీటివల్ల వంద కోట్ల యూరోలకు పైగా మొత్తం సమకూరుతుంది.