- డాక్టర్ల అయిదు రోజుల సమ్మె ప్రారంభం
- సమ్మెకు సిద్ధమవుతున్న టీచర్లు
- అదే బాటలో సెక్యూరిటీ గార్డ్సు
లండన్ : నయా ఉదారవాద విధానాల యుగంలో బ్రిటన్ సమ్మెలతో అట్టుడుకుతోంది. పెరుగుతున్న ధరలకనుగుణంగా 35 శాతం మేర వేతన పెంచాలని డిమాండ్ చేస్తూ డాక్టర్లు, టీచర్లు, ఎన్‌హెచ్‌ఎస్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు ఇలా సమస్త రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలు, ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ డాక్టర్లు అయిదు రోజుల సమ్మెకు గురువారం ఉపక్రమించారు. వేతన పెంపుదలపై వివాదం తలెత్తినప్పటి నుంచి జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెల్లో ఇది నాల్గవది. టీచర్స్ ఈ వర్షాకాల సీజన్‌లోనే సమ్మెకు వెళ్లాలని తీర్మానించుకున్నారు. సెక్యూరిటీ గార్డులు ఇప్పటికే సమ్మెలో ఉన్నారు. డాక్టర్లు, టీచర్లు 35 శాతం వేతన పెంపుదలను కోరుతుంటే, ప్రభుత్వం 6 శాతం పెంచుతామని ఆరోగ్యశాఖ మంత్రి స్టీవ్ బర్క్‌లే ప్రతిపాదించారు. దీనిని వారు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పెరిగిన ద్రవ్యోల్బణంతో నిజవేతనాలు పడిపోయాయి. 2008 నాటి స్థాయికి ప్రస్తుత వేతనాలు చేరాయని, ఈ లోటును భర్తీ చేయాలంటే 35 శాతం పెంపుదల తప్పనిసరి అని వైద్యులు, టీచర్లు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తేల్చి చెప్పారు. ప్రధాని సునాక్ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ, డాక్టర్లు సమ్మె విరమించుకుంటే మంచిదని అన్నారు. బ్రిటన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల్లో సగం మంది దాకా జూనియర్ డాక్టర్లు ఉన్నారు.సర్జరీ విభాగంలో నాలుగో వంతు వీరే. మరో వైపు టీచర్ల సమ్మెకు ఓటింగ్ నిర్వహించగా అత్యధిక శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేయడంతో త్వరలోనే వారు కూడా మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు.