Oct 21,2023 09:07
  • క్షీణించిన పలువురి ఆరోగ్యం
  • దీక్షలు తాత్కాలికంగా వాయిదా : యుటిఎఫ్‌

ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వం సిపిఎస్‌, జిపిఎస్‌లను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న నిరవధిక దీక్షలను పలు జిల్లాల్లో పోలీసులు భగ్నం చేశారు. దీక్షలు చేస్తున్న వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. పలు జిల్లాల్లో దీక్షలు కొనసాగాయి. శుక్రవారం మరికొన్ని జిల్లాల్లో దీక్షలు ప్రారంభమయ్యాయి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో దీక్షలు చేస్తున్న వారిలో పలువురి ఆరోగ్యం క్షీణించింది. దీంతో, వైద్యుల సూచన మేరకు దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ ప్రకటించారు. విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిరవధిక దీక్ష శిబిరాల వద్దకు పోలీసులు వచ్చారు. దీక్షలను అనుమతి లేదని, వెంటనే విరమించాలని అన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ దీక్ష కొనసాగిస్తామని యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. దీంతో, పోలీసులు అరెస్టులకు పూనుకున్నారు. ఈ సందర్భంగా వారికి, యుటిఎఫ్‌ నాయకులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. రెండు రోజులుగా ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా దీక్షలు చేస్తుండడంతో కొందరికి ఆరోగ్యం క్షీణించిందని, బిపి, షుగర్‌ లెవెల్స్‌ తగ్గిపోయాయని వైద్యులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో దీక్షలు కొనసాగాయి. అల్లూరి జిల్లా పాడేరు, అరకులోయ, చింతూరుల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అరకులోయలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద తలపెట్టిన దీక్షలను గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురంల్లో దీక్షా శిబిరాలను ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏలూరులో యుటిఎఫ్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక దీక్షలకు ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, ఎపి గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు సంఘీభావం తెలియజేశారు.
 

                                                            ఒపిఎస్‌పై క్షేత్ర స్థాయిలో తేల్చుకుంటాం : యుటిఎఫ్‌

ఒపిఎస్‌పై ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావుతో కలిసి విలేకరులతో వారు మాట్లాడారు. సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి జిపిఎస్‌ను తీసుకురావడం శోచనీయమన్నారు. 2040 నాటికి పెన్షన్‌ భారం వేల కోట్ల రూపాయలు పెరగనుందని ముఖ్యమంత్రి చెబుతున్నారని, జిపిఎస్‌ జిఒలో మాత్రం కేవలం రూ.2,500 కోట్లు అని ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. కంట్రిబ్యూషన్‌లేని పెన్షన్‌ను ఉద్యోగులు కోరుతున్నారని తెలిపారు. పాత పెన్షన్‌ పునరుద్ధరణకు నిరవధిక దీక్షలు చేపడతామని, ఈ నెల 9న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాము నోటీసు అందించామని తెలిపారు. అయినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరవధిక దీక్షలకు దిగాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 3.5 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాత పెన్షన్‌ అమలు చేయకుండా జిపిఎస్‌ అమలు చేయడం తగదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒపిఎస్‌ పునరుద్ధరిస్తామనే పార్టీకే ఓట్లు వేయాలనే ప్రచారం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఒపిఎస్‌ పునరుద్ధరణ డిమాండ్‌ను సజీవంగా ఉంచాలనే డిమాండ్‌తో చేపట్టిన యుటిఎఫ్‌ దీక్షలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఒపిఎస్‌ పునరుద్ధరణకు రాష్ట్రంలో పలుచోట్ల చోట్ల బహిరంగ సభలు నిర్వహించి ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయులను సమైఖ్య పరుస్తామన్నారు. యుటిఎఫ్‌ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, సహాధ్యక్షులు ఎఎన్‌ కుసుమకుమారి, ఎస్‌పి మనోహర్‌కుమార్‌, ప్రచురణల విభాగం చైర్మన్‌ ఎం హనుమంతరావు పాల్గొన్నారు.