Oct 20,2023 10:34

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. జిపిఎస్‌ మాకొద్దు, ఒపిఎస్‌ అమలు చేయాలని నినదించారు. ఒపిఎస్‌ సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీక్షకు పలు ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక దీక్షలను ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించి మాట్లాడారు. సిపిఎస్‌కు ప్రత్యామ్నాయం జిపిఎస్‌ కాదన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో దీక్షా శిబిరాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, మాజీ ఎంపి పి మధు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఒపిఎస్‌ అమలు కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటం న్యాయమైందని,అందరూ నైతికంగా మద్దతివ్వాలని కోరారు. ఏలూరులో దీక్షలను ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ప్రారంభించి మాట్లాడారు. పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ రద్దు చేయాల్సిందిపోయి జిపిఎస్‌ అనే ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేయడం సరికాదన్నారు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు నష్టపోతారని తెలిపారు.

22


           విజయవాడలోని యుటిఎఫ్‌ కార్యాలయంలోని దీక్షా శిబిరాన్ని యుటిఎఫ్‌ మాజీ అధ్యక్షులు కె జోజయ్య సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్పొరేట్ల సేవకు ఉపయోపడే జిపిఎస్‌ విధానం వద్దని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రతనిచ్చే ఒపిఎస్‌ సాధించి తీరాలని చెప్పారు. ఒపిఎస్‌ను ప్రభుత్వం పునరుద్ధరించకపోతే ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా కన్వీనర్‌ కె ధనలక్ష్మీ, ఎపిఎన్‌జిఒ సంఘం నాయకులు విద్యాసాగర్‌, తదితరులు సంఘీభావం ప్రకటించారు. యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఐక్య ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు కుమార్‌ రాజా, తదితరులు దీక్షలో కూర్చొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి, కాకినాడలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాము, అమలాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు దీక్షలను ప్రారంభించారు. జిపిఎస్‌ను రద్దు చేయాలని, ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. శ్రీకాకుళంలో దీక్షలను యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదర్‌ రవీంద్ర ప్రారంభించారు.
           అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట దీక్షలను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ ప్రారంభించారు. సిపిఎస్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని అంబేద్కర్‌ సెంటర్‌లో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దీక్షలు చేపట్టారు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు దీక్షలను ప్రారంభించారు. కడప, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దీక్షలను నేతలు ప్రారంభించి సంఘీభావం తెలిపారు.