ఇంకా ఆకలిగా వుంది
లోపల అన్నం పురుగు తొలిచేస్తోంది
తన ఎంగిలినే గుటకలుగా మింగుతున్నవాళ్ళకు
బడ్జెట్ కసువునుండి తాలుగింజలే రాలుతున్నాయి
ఆసుపత్రిలో ...
సూది మందు కావాలా, గోళీమందు కావాలా?
అనడిగితే కలిగే బీదల సందిగ్ధత
ఇన్నేసి భరోసాల్ని పట్టుకుని తీవ్రంగా కుదుపుతుంది
పేరుకే ముందడుగు
రాజ్యాంగం పునాదిపైన
ఏళ్ళనాటి అసంపూర్ణ ఇల్లు
ఇంటిలో పూతపూయని గోడొక దేశ ముఖచిత్రం
గదిలో అంటరాని కుండ
అయినా ఈ దేశాన్నీ, దుఃఖాన్నీ కలిపే ప్రేమిస్తున్నాం!
అందరూ ఆడుకుంటుంటే
మధ్యలో మొండాట ఆడి
అలిగి వెళ్ళిపోతే, అదే రాజ్యం
పోరాటం ఎక్కడ విస్తరిస్తుందోనని
మొక్కగానే పీకిపారేస్తే, అదే రాజ్యం
మొన్నొక బిల్కిస్ బానోకు
నిన్నొక బిల్కిస్ బానోకు
నేరస్తులు చేసిన గాయం కంటే
మానభంగానికి, మానవత్వానికి తేడా తెలీని
అత్యాచారానికి, కుజదోషానికి తేడా తెలీని
వ్యవస్థ చేసిన గాయానిదే నొప్పెక్కువ !
ఆధారంగా నమ్మించిన కొమ్మను
నమ్మి ఆనుకుంటాం
పెట్టుకున్న నమ్మకం
మరో పుచ్చుకొమ్మగా విరుగుతుంది
మన బలహీనత వారి ఒరలోని కత్తి
అది గాయపరచడాన్ని రుచి మరిగింది
ఒక హిమానీనదంలాగా
పైకి కనిపించని కదిలికేదో కదులుతూనే వుంది
కాని మన పోరాటాలేవో లావాలా విస్ఫోటించాలి
ఇన్నాళ్ళూ ఎవరికోసమో నిచ్చెన మోసింది చాలు
కాడికి తలవంచింది చాలు
భుజాలు కాయగాచింది చాలు
దేశస్థుడి ముఖం మూత్రంతో తడిచింది చాలు
కన్నీటికీ మూత్రానికి తేడా తెలీనివారి ముందు
కంటిచెమ్మ, కలకున్న కవచాన్ని తుప్పు పట్టిస్తుంది!
- శాంతయోగి యోగానంద
9110770545










