
సరైన అవగాహన లేక, సకాలంలో గుర్తించక మనదేశంలో ఏటా వేలాది మంది బ్రెస్ట్ కేన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. కీలకమైన ఈ సమస్యపై అవగాహన కోసం నేడు అనేక చోట్ల స్వీయ బ్రెస్ట్ పరీక్షలు చేసుకునేలా సెమినార్లు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అలా ఇటీవల మదనపల్లిలో నిర్వహించిన ఓ మెడికల్ క్యాంపులో ఇద్దరు యువతులు సేవలు అందించారు. అక్కడికి వచ్చిన మహిళలు వీరిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏవిధమైన పరికరాలు ఉపయోగించకుండా కేవలం చేతితో తడుముతూ- వ్యాధి ఉన్నదీ లేనిదీ చెప్పేస్తున్న వారి వైపే.. కన్నార్పకుండా చూశారు. ఎందుకంటే- ఆ యువతులు ఇద్దరూ అంధులు.

నూరిన్నీసా డాక్టరు కావాలని బాల్యం నుండే కలలు కన్నది. కనీసం నర్సుగా అయినా సేవలు అందించాలనుకుంది. అయితే వైద్య విద్యలో అంధులకు ప్రవేశం లేకపోవడం వల్ల పుట్టుకతోనే అంధురాలైన నూర్‌కు తన ఆశ నెరవేరలేదు. అందుకే సాధారణ డిగ్రీలో చేరింది. అయితే తన కల చెదిరిపోయిందని ఎప్పుడూ దిగులు పడలేదు. చదువు పూర్తయిన తరువాత మెడికల్ టాక్టిల్ ఎగ్జామినర్ (ఎంటిఇ)గా శిక్షణ పొందింది. 'డిస్కవరింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్'లో భాగంగా సకాలంలో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మహిళలను పరీక్షించే ఎంటిఇలో శిక్షణ తీసుకుంది.
'నేను ఇటీవల కర్నాటకలోని ఓ మారుమూల పల్లెలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో పాల్గొన్నాను. పరీక్షలు చేస్తూ.. ఈ స్వీయ పరిశీలన ఎందుకు ముఖ్యమో వారికి అవగాహన కల్పిస్తున్నాను. అప్పుడు అక్కడికి వచ్చిన మహిళలు నన్ను డాక్టర్ అని పిలిచారు. చాలా సంతోషమేసింది' అంటూ తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పింది నూర్. నూర్ స్నేహితురాలు ఆయేషా కూడా అంధురాలే. వీరిద్దరూ ఈ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకున్న మొదటి బ్యాచ్ సభ్యులు.
ఈ కార్యక్రమ ఆలోచన చేసింది జర్మన్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ హాఫ్‌మాన్. ఎలాంటి పరికరాలూ ఉపయోగించకుండా అంధులైన మహిళలను ఎంటిఇగా శిక్షణ ఇవ్వాలనుకోవడం వెనుక చాలా పెద్ద ఉద్దేశమే ఉంది. దృష్టి లోపం ఉన్న వారు వినికిడి పరంగానూ, స్పర్శ పరంగానూ చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎంటిఇ శిక్షణ తీసుకున్న అంధులు, 0.3 మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజు కణితులను కూడా గుర్తిస్తున్నారు.

ఢిల్లీకి చెందిన 'నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్' ఈ ప్రోగ్రామ్‌కి రూపకల్పన చేసింది. ఇప్పటికి నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. మొదటిబ్యాచ్ విద్యార్థులైన నూర్, ఆయేషా బెంగళూరులోని సైట్‌కేర్ కేన్సర్ హాస్పటల్‌లో ఎంటిఇలుగా పనిచేస్తున్నారు. నూర్, ఆయేషాల ఈ ప్రయాణంలో తొలి అడుగు వేయించిన సంస్థ 'ఎనేబుల్ ఇండియా'. 'దృష్టిలోపం ఉన్న వాళ్లు తమ శక్తి సామర్థ్యాలు తెలుసుకునేలా వారి జీవన ప్రమాణాలు పెంచడం, విద్య వంటి వాటిలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా చేయడంలో ఈ సంస్థ కృషి చేస్తోంది.
శిక్షణ ఇలా ...
అసలు ఈ శిక్షణ ఎలా ఉంటుంది? అని ప్రశ్నించినప్పుడు - డిస్కవరీ హ్యాండ్స్ ప్రోగ్రామ్ నిర్వాహకులు అశ్వినీరావు ఇలా వివరించారు... :
'ఇది 9 నెలల ప్రోగ్రాం. ఇందులో ఆరు నెలల తరువాత థియరీ పరీక్ష కూడా నిర్వహిస్తాం. ఆ తరువాత గైనకాలజిస్ట్ లేదా ఆంకాలజిస్ట్ వద్ద ఇంటర్న్‌షిప్‌లో మూడు నెలలు శిక్షణ ఇప్పిస్తాం. శిక్షణ పూర్తయ్యాక 'ఎనేబుల్ ఇండియా' ద్వారా డాక్టర్ హాఫ్‌మన్ పర్యవేక్షణలో వారికి ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. ఇలా శిక్షితులైన వారికి మహిళల పునరుత్పత్తి వ్యవస్థ, రొమ్ము కణజాలంపై కూడా అవగాహన కల్పిస్తాం. ఆ తరువాత మరో మూడు నెలల శిక్షణలో కంప్యూటర్ పరిజ్ఞానం, రోగులతో ఎలా ప్రవర్తించాలి, హాస్పటల్ ఫైల్స్ ఎలా నిర్వహించాలి వంటి విషయాలపై అవగాహన కల్పిస్తాం.'
పరీక్షలు ఎలా చేస్తారు ?
ఈ విధానంలో మహిళలకు ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తారో ఆయేషా వివరించారు... : 'రోగులతో మేం పరిచయాలు పెంచుకుంటాం. వారి కుటుంబ చరిత్ర తెలుసుకుంటాం. మునుపటి శస్త్రచికిత్సల గురించి ఆరా తీస్తాం. ఏవైనా అనుమానాలు ఉంటే చెప్పమంటాం. ఆ తరువాత ఛాతీపై చర్మంలో ఏవైనా మార్పులు ఉన్నాయా అని అడుగుతాం. మెడ, కాలర్ ఎముకల వాపు, నొప్పి గురించి చెప్పమంటాం. చేతితో తడుముతూ ఒక్కోసారి రెండు వ్రేళ్లతో తాకుతూ బ్రెస్ట్ ఆకృతి, ఉష్ణోగ్రత వివరాలను తెలుసుకుంటాం. ఆ వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదు చేస్తాం.'
'ఈ పరీక్షలో రోగులు ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆందోళనలో వారు సరిగ్గా పరీక్షకు సిద్ధంగా ఉండరు. కాబట్టి మేం వారితో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటాం' అని చెప్పారు నూర్.
నూర్, ఆయేషా 2019లో ఎనేబుల్ ఇండియాలో ఎంటిఇ శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. కోవిడ్ లాక్‌డౌన్‌ల వల్ల ఆటంకాలు ఏర్పడి, 2022 నాటికి శిక్షణ పూర్తయింది. ఆ తరువాత సైట్‌కేర్ హాస్పటల్‌లో వివిధ విభాగాల్లో పనిచేశారు. ప్రస్తుతం పూర్తి కాలం కేన్సర్ గుర్తింపు ప్రోగ్రాంలో పనిచేస్తున్నారు.