
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 8మ్యాచుల్లో నెగ్గిన భారత్.. ఐసిసి బుధవారం వెల్లడించిన ర్యాంకింగులలోనూ దుమ్మురేపింది. భారత్ 121 రేటింగ్‌పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా(114పాయింట్లు), దక్షిణాఫ్రికా(111పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. టీ20ల్లో టీమిండియా 265 పాయింట్లతో, టెస్టుల్లో 118రేటింగ్ పాయింట్లతో ఇప్పటికే తొలి స్థానంలో ఉన్న టీమిండియా.. తాజాగా వన్డేల్లోనూ టాప్ ర్యాంక్‌కు ఎగబాకడంతో మూడు ఫార్మాట్‌లలో చాలాకాలం తర్వాత తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇక వన్డే బ్యాటర్ల జాబితాలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకోగా... బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నెంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ వన్డే ర్యాంకింగ్స్‌లో 830పాయింట్లతో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉండగా.. రన్ మెషిన్ విరాట్ కోహ్లి 770పాయింట్లతో నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ 739పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. ఇక బౌలర్లలో జాబితాలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ 709పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా... 661 పాయింట్లతో కుల్దీప్ యాదవ్, 654 పాయింట్లతో జస్ప్రీత్ బుమ్రా 8వ స్థానంలో, 635 పాయింట్లతో మహ్మద్ షమీ పదో స్థానంలో నిలిచారు. ఇక టి20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. 863 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో టాప్-10 బ్యాటర్లలో రోహిత్ శర్మ పదో స్థానంలో ఉండగా బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ప్రథమ స్థానంలో, రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా నెంబర్ వన్ స్థానంలో ఉండగా రెండో స్థానంలో అశ్విన్, ఐదో స్థానంలో అక్షర్ పటేల్ ఉన్నారు.