ముంబయి : దీపావళి పండుగ సందర్బంగా స్టాక్ మార్కెట్లలో ముహురత్ ట్రేడింగ్ జరగనుంది. పండగ రోజున పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయనే విశ్వాసంతో ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను కొనుగోలు చేసే అనవాయితి ఉంది. దీపావళి పండుగ ఆదివారం రావడంతో సెలవు దినం అయినప్పటికీ బిఎస్‌ఇలో ఎప్పటి తరహాలోనే గంట సేపు ట్రేడింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7.15 వరకు ముహురత్ ట్రేడింగ్ జరగనుందని బిఎస్‌ఇ వెల్లడించింది. ఇందులో 15 నిమిషాలు ప్రీ మార్కెట్ సెషన్ ఉంటుంది. ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్‌లు, కరెన్సీ డెరివేటివ్‌లు, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లు, సెక్యూరిటీల లెండింగ్ అండ్ బారోయింగ్ తదితర విభాగాల్లో ట్రేడింగ్‌కు వీలుంటుంది. గత పది ముహూర్తపు ట్రేడింగ్ సెషన్‌లలో ఏడుసార్లు స్టాక్ మార్కెట్‌లు లాభాలను నమోదు చేయగా.. మూడు సార్లు ప్రతికూలతను చవి చూశాయి.
గతేడాదిలో 9% వృద్థి
గతేడాది దీపావళి నుంచి ఇప్పటి వరకు భారత ఈక్విటీ మార్కెట్లు 9 శాతానికి అటూ, ఇటుగా లాభపడ్డాయి. ఒక దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు ట్రేడింగ్ కాలాన్ని సంవత్‌గా వ్యవహరిస్తారు. 2079 సంవత్ ట్రేడింగ్ శుక్రవారంతో పూర్తయింది. ఈ ఏడాది 2080 సంవత్ ప్రారంభం కానుంది. గడిచిన ఏడాదిలో సెన్సెక్స్ 5,073.02 పాయింట్లు లేదా 8.47 శాతం, నిఫ్టీ 1,694 పాయింట్ల 9.55 శాతం చొప్పున రాణించాయి. చొప్పున లాభాలు నమోదు చేశాయి. ఇదే సమయంలో బిఎస్‌ఇ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.43.81 లక్షల కోట్లు పెరిగి రూ.320.29 లక్షల కోట్లకు చేరింది.