Dec 16,2022 10:07
  • మాండూస్‌ తుపాను మిగిల్చిన నష్టం
  • ప్రకాశం జిల్లాలో 25 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట
  • రూ.125 కోట్ల నష్టం !

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : మాండూస్‌ తుపాను పొగాకు రైతులను గుల్లగుల్ల చేసింది. చేతికందే దశలో తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు పొగాకు తోటలు నిలువునా దెబ్బతిన్నాయి. నీటిలో తేలాడాయి. వర్షం తగ్గగానే తోటలు వాడిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో ఎంత నష్టం అనేది తేలనుంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లాలో 25 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో తోటల్లో నీరు ఉంది. దిగుబడి తగ్గనుంది. మొక్కలు ఉరకెత్తిపోతున్నాయి. కొన్ని కోలుకున్నా నష్టం తప్పదు. వీటిని పీకేసి మళ్లీ నాట్లు వేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. నష్టం రూ.125 కోట్ల వరకూ ఉంటుందని చెప్తున్నారు.
 

                                                         కొండపి, టంగుటూరు ప్రాంతాల్లో భారీ నష్టం

కొండపి, టంగుటూరు వేలం కేంద్రాలతోపాటు ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగాకు బాగా దెబ్బతింది. నల్లరేగడి నేలలు కావడంతో నష్టం ఎక్కువగా ఉంది. కొండపి వేలం కేంద్రం పరిధిలో 16 వేల ఎకరాల్లో పొగాకు వేశారు. వర్షాలకు సగానికిపైగా పంట పూర్తిగా దెబ్బతింది. మిగతా పంట ఎంత మేరకు చేతికందుతుందో కూడా స్పష్టత లేదు. మర్రిపూడి, కొండపి మండలాల్లో ఇప్పటికే ఒకసారి ఆకును కోశారు. బ్యారన్‌లో పెట్టారు. క్యూరింగు కూడా మొదలైంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎకరాకు రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. నాట్లు వేయడం, సాగు, ఎరువులు, ఆకుకొట్టుడు, క్యూరింగు వంటి పనులకు భారీగానే పెట్టుబడి పెట్టాల్సి ఉంది. టంగుటూరు మండలంలోనూ సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో పంట బాగా దెబ్బతిన్నట్లు అంచనా. ఒంగోలు, మేదరమెట్ల, వెల్లంపల్లి కేంద్రాల పరిధిలోనూ సుమారు పది వేల ఎకరాల్లో పొగాకు తోటలు నీటమునిగాయి.
 

                                                                క్యూరింగు మొదలయ్యే దశలో..

పొగాకు క్యూరింగు మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ముందుగా నాట్లు వేసిన రైతులు ఒకసారి ఆకుకొట్టారు. క్యూరింగులో ఉన్నారు. అంటే పంట చేతికి అందే దశ. ఇలాంటి సమయంలో వర్షాలు నిలువునా ముంచాయి. పెట్టుబడులు కూడా 75 శాతం పెట్టారు. పంట ఆశాజనకంగా ఉంది. కర్ణాటకలో ఈ ఏడాది కిలో పొగాకు రూ.200 ధర పలికింది. ధరలపై రైతులు ఆశగా ఉన్నారు. అంతా సవ్యంగా ఉంటే ఈ ఏడాది మంచి ధరలు వస్తాయని భావించారు. ఇప్పుడు భారీ వర్షాలు నిలువునా ముంచాయి. పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది పొగాకు బోర్డు 142 మిలియన్‌ల కిలోల పొగాకు పండించడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో 70 శాతం ప్రకాశం జిల్లాలోనే పండుతుంది. కీలకమైన సమయంలో తోటలు దెబ్బతినడంతో ఈ ఏడాది అనుమతి కన్నా తక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
 

                                                                        స్పందించని కేంద్రం

జిల్లాలో అన్ని రకాల పంటలూ సుమారు లక్ష ఎకరాల్లో నీటమునిగాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల్లోనే 32 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. పొగాకుకు ఎక్కువ నష్టం కనిపిస్తోంది. కేంద్రం ఇంత వరకూ స్పందించలేదు. పొగాకు బోర్డు ద్వారా రైతులను ఆదుకునే చర్యలు కనిపించలేదు. ఎంపిలు ఇక్కడ కనీసం రైతులను పరామర్శించే పరిస్థితి కూడా లేదు.

 

11



                               ఆదుకోవాలి - మొలకలపల్లి కోటేశ్వరరావు, ఉప సర్పంచ్‌, పొగాకు రైతు, సూరారెడ్డిపాలెం.
నాతోపాటు మా కుటుంబ సభ్యులు, సమీప బంధువులందరం కలిసి ఈ ఏడాది 130 ఎకరాల్లో పొగాకు సాగు చేపట్టాం. ఎకరాకు రూ.60 వేల నుండి రూ.లక్ష వరకూ పెట్టుబడి అయింది. మాండూస్‌ తుపాను వల్ల పంటంతా వర్షం నీటిలో మునిగింది. నీటిని బయటకు పంపే మార్గం లేదు. ఎంత తక్కువగా అనుకున్నప్పటికీ రూ.కోటి దాకా నష్టం వస్తుంది. పొగాకు బోర్డు అధికారులు నష్టం నివేదికలు రూపొందించి రైతులను ఆదుకోవాలి.

 

Tobacco-farmers-oyster



                         రూ.68 లక్షలు బూడిదలో పోసిన పన్నీరే - ఉప్పలపాటి రామరాజు, పొగాకు రైతు, కందులూరు

ఈ ఏడాది 105 ఎకరాల్లో పొగాకు సాగు చేపట్టాను. ఇప్పటి వరకూ పొలం దుక్కు దున్నడం, గొర్రు తోలకం, పొగనారు, కూలీలు తదితర ఖర్చులన్నీ కలుపుకొని రూ.68 లక్షలు పెట్టుబడి అయింది.
మాండూస్‌ నిలువునా ముంచింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అర ఎకరా కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. పొగాకు బోర్డు, ప్రభుత్వం త్వరితగతిన స్పందించి పొగాకు రైతులను ఆదుకోవాలి.