Jul 03,2023 07:39

జీవితాలకేం ప్రయాణిస్తూనే ఉంటారు
ఒక్కోసారి సెకెన్ల ముల్లులా పరుగులు తీస్తారు
మరోసారి నిమిషాల ముల్లుతో పాటు
ఆచితూచి అడుగులు వేస్తూ
గంటల ముల్లుతో బద్ధకంగా
సోమరిగా కదులుతూ
కాలంతో పాటూ నడుస్తూనే ఉంటాయి
ఈ మనసే పరమదుర్మార్గపుది
జ్ఞాపకాల పుట్టని నిరంతరమూ తవ్వుతూ
జీవితం ముంగిట్లో ఆశలచెట్టు మొదల్నే
సారవంతం చేస్తున్నానంటుంది
కానీ, కాసిని చిరునవ్వు పువ్వుల్ని
ఎప్పుడో గానీ పెదాల మీద అలంకరించదు

జీవితంతో చేయి చేయి కలిపి
ఈ మనసు నడవకుండా
నడక దారంతా ముళ్ళు రాలుస్తూ
సాల్వడార్‌ కరిగిపోతున్న కాలం గురించి
కథలు కథలుగా చెప్పి
నిరుత్సాహపు పొరల్ని
కళ్ళ మీద పరిచి చెలమల్ని అద్దుతుంది !

ఎప్పుడో ఒకప్పుడు సమయం చూసి
ఈ దుర్మార్గపు మనసుని
ఒడుపుగా బంధించి
ఆలోచనల్ని ఎగిరిపోనీయకుండా
పిడికిట పట్టి మనసులో ఒంపి
పెంపుడు పిల్లిని చేసి మనవెనకే తిప్పుతూ
పక్కదార్లు పట్టనీకుండా
జీవితంతో చేతులు కలిపి నడవాల్సిందే
తప్పదు గాక తప్పదు !
 

- శీలా సుభద్రాదేవి
81068 83099