Oct 31,2022 08:17

రూపం మారుతోంది
నదులు, సెలయేరులు,
జలపాతాలతో నిండి ఉన్న దేహంలోకి
కాగే ఇనుపగుండ్లు ప్రవేశించాయి

దేహాన్ని రాల్చుకుంటూ
ఒకానొక దశలో ఆకాశ దుప్పటిని కప్పుకున్నట్టు
ఎవరికీ కనపడని ప్రదేశంలో
రూపానికి మరమ్మతులు చేసుకోవాలి

గీసుకున్న రేఖల నుంచి
నిర్దేశించుకున్న చలనరహిత గమ్యాల నుంచి
తప్పటడుగుల గమనాల నుంచి
పాదముద్రలను చెరిపేసుకొని
తేజోవంతమైన పయనం వైపు సాగాలి
నిశీధిని పులుముకున్న నుదుటిలో
అక్షర సమూహాలను నింపుకోవాలి
వేళ్ళ మధ్య బిగుసుకుపోయిన సున్నితత్వాన్ని
పొడి పొడిగా దేహంలోకి ఇంకించుకోవాలి
ఇప్పుడు కావాల్సింది రెండే పరికరాలు
ఒకటి ఉలి
రెండు సుత్తి
కోల్పోతున్న రూపాన్ని చెక్కుకోడానికి

- జాని తక్కెడశిల
72595 11956