Sep 25,2023 10:45
  • షూటింగ్‌లో డబుల్‌ ధమాకా
  • తొలి రోజు ఐదు పతకాలు కైవసం
  • 2023 హౌంగ్జౌ ఆసియా క్రీడలు

హౌంగ్జౌ : ఆసియా క్రీడల్లో టీమ్‌ ఇండియా పతక వేట ఘనంగా మొదలైంది. తొలి రోజు పోటీల్లోనే ఐదు పతకాలు దక్కించుకున్న భారత్‌.. శతకం దిశగా గట్టిగా బోణీ చేసింది. రోయర్లు మూడు మెడల్స్‌ అందించగా, షూటర్లు రెండు పతకాలు కట్టబెట్టారు. భారత మహిళల క్రికెట్‌ జట్టు కనీసం రజత పతకం ఖాయం చేసింది. మెన్స్‌ డబుల్‌ స్కల్‌ విభాగంలో అర్జున్‌ లాల్‌ జాట్‌, అరవింద్‌ సింగ్‌ జోడీ సిల్వర్‌ మెడల్‌ గెల్చుకోగా.. మెన్స్‌'ఎయిట్‌' విభాగంలో మనోళ్లు రజత సత్తా చూపారు. మెన్స్‌ పెయిర్‌ విభాగంలో బాబులాల్‌ యాదవ్‌, లాఖ్‌ రామ్‌ జోడీ మూడో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది.

హైలెస్సో.. హైలెస్సో : రోయింగ్‌లో భారత రోయర్లు సత్తా చాటారు. తొలుత మెన్స్‌ డబుల్‌ స్కల్‌లో అర్జున్‌, అరవింద్‌ జోడీ సిల్వర్‌తో మెరిసింది. 6.28.18 సెకండ్లలో రేసు పూర్తి చేసిన అర్జున్‌, అరవింద్‌లు.. చైనా రోయర్ల తర్వాత స్థానంలో నిలిచారు. 6.23.16 సెకండ్లతో చైనా పసిడి నెగ్గగా.. 6.32.42 సెకండ్లలో రేసు ముగించి ఉబ్బెకిస్థాన్‌ కాంస్య పతకం సాధించింది. ఇక మెన్స్‌ 'ఎయిట్‌' రేసులోనూ భారత్‌కు సిల్వర్‌ మెడల్‌ దక్కింది. నీరజ్‌, నరేశ్‌, నితీశ్‌, చరణ్‌జిత్‌, జస్విందర్‌, భీమ్‌ సింగ్‌, పునిత్‌, ఆశీష్‌, ధనంజయలు రోయింగ్‌లో భారత్‌కు రెండో మెడల్‌ అందించారు. ఇక మెన్స్‌ పెయిర్‌ విభాగంలో బాబు లాల్‌ యాదవ్‌, లేఖ్‌ రామ్‌లు సైతం మెరిశారు. 6.50.41 సెకండ్లలో రేసు పూర్తి చేసిన బాబులాల్‌, రామ్‌లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకున్నారు. చైనా పసిడి పతకం సాధించగా, ఉబ్బెకిస్థాన్‌ సిల్వర్‌ మెడల్‌ ఎగరేసుకుపోయింది.

22

'గురి' కుదిరింది : 19వ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించారు అమ్మాయిలు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో టీమ్‌ ఇండియా షూటర్లు రెండు పతకాలు గురి పెట్టారు. జట్టు విభాగంలో సిల్వర్‌ సాధించగా, వ్యక్తిగత విభాగంలో కాంస్యం దక్కింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ జట్టు విభాగంలో రమిత, మెహులీ ఘోష్‌, ఆశి చౌదరి త్రయం గురి తప్పలేదు. 1886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన మన షూటర్లు సిల్వర్‌ మెడల్‌ సాధించారు. 1896 పాయింట్లతో చైనా షూటర్ల త్రయం పసిడి పతకం నెగ్గింది. మంగోలియా షూటర్లు 1880 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకున్నారు. ఇక వ్యక్తిగత విభాగంలో రమిత కాంస్యం నెగ్గింది. రమిత 631.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి మెడల్‌ దక్కించుకోగా.. మెహులీ ఘోష్‌ 630.8 పాయింట్లతో నాల్గో స్థానానికి పరిమితమై తృటిలో పతకం చేజార్చుకుంది. 623.3 పాయింట్లే సాధించిన ఆశి చౌదరి 29వ స్థానానికి పరిమితమై పతక పోటీకి సైతం అర్హత సాధించలేదు.

క్రికెట్‌లో మెడల్‌ ఖాయం : ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత్‌ తొలి మెడల్‌ ఖాయం చేసుకుంది. మహిళల విభాగంలో టీమ్‌ ఇండియా ఫైనల్స్‌కు చేరుకోగా.. కనీసం సిల్వర్‌ మెడల్‌ లాంఛనమైంది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని టీమ్‌ ఇండియా 8.2 ఓవర్లలో ఊదేసింది. షెఫాలీ వర్మ (17), జెమీమా రొడ్రిగస్‌ (20)లు ఛేదనలో మెరిశారు. దీంతో మరో 70 బంతులు మిగిలి ఉండగానే టీమ్‌ ఇండియా 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో సెమీఫైనల్లో పాకిస్థాన్‌ మహిళలపై శ్రీలంక మహిళల జట్టు ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 75/9 పరుగులు చేయగా.. 16.3 ఓవర్లలోనే శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. నేడు జరిగే పసిడి పోరులో భారత్‌, శ్రీలంక తలపడనున్నాయి. కాంస్య పతక పోరులో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఢకొీట్టనున్నాయి.