- ఆయిల్ కంపెనీలో ప్రమాదంతో కార్మికుల్లో కలవరం
- పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కరువు
- పట్టించుకోని అధికార యంత్రాంగం
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాకినాడ రూరల్‌లోని టైకీ పరిశ్రమలో 2021 మార్చి 11న రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 2022 ఆగస్టు 19న ప్యారి షుగర్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే పరిశ్రమలో పది రోజుల వ్యవధిలో 2022 ఆగస్టు 29న టన్ను బరువు ఉన్న యాంగిలర్ పడి మరో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదాల సంబంధించి అధికారులతో విచారణ కమిటీలు వేశారు. అయితే నేటికీ ఆ కమిటీల నివేదికలుగానీ, తీసుకున్న చర్యలుగానీ బహిర్గతం చేయలేదు. తాజాగా అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్ కంపెనీకి చెందిన పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని ఆయిల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఏకంగా ఏడుగురు బలయ్యారు. దీనిపైనా కమిటీ వేశారు. ఈసారైనా నివేదికను బహిర్గతం చేస్తారా? లేక షరా మామూలుగానే వదిలేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా, భారీ పరిశ్రమలు మొత్తంగా ఎనిమిది వేలకుపైగా ఉన్నాయి. వీటిల్లో దాదాపుగా 1.40 లక్షల మంది పని చేస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 172 ప్రమాదకర ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిల్లో 22 అత్యంత ప్రమాదకర పరిశ్రమలు. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలు కార్మికుల భద్రతపై పక్కాగా తగిన ప్రమాణాలు పాటించాల్సి ఉంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి. కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం, యాజమాన్యాలకు అనుకూలంగా మార్చడంతో అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో, యాజమాన్యాలు కార్మిక భద్రతను పూర్తిగా గాలికొదిలేస్తున్నాయి.
ఈ నివేదికైనా బయట పెట్టేనా ?
పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం తర్వాత పరిశ్రమల శాఖ, కార్మిక, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక శాఖల అధికారులతో కమిటీని కలెక్టర్ కత్తికా శుక్ల గురువారం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు పరిశ్రమ బయట గేటుకు సీల్ వేశారు. ప్యాకింగ్ కోసం చేరిన కార్మికులకు ట్యాంకు క్లీనింగ్‌ను అప్పగించడం, కనీసం భద్రత కల్పించకపోవడం, ఏడుగురు చనిపోయినా యాజమాన్యం స్పందించకపోవడం వంటి వాటిపై విచారణ చేయాల్సి ఉంది. ప్రమాదం జరిగిన పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని ఆయిల్ పరిశ్రమను జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా, కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఎం.అశోక్‌కుమార్, ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ నాగూల్ మీరా శుక్రవారం సందర్శించారు. అయిల్ ట్యాంక్‌లోని మడ్డు శ్యాంపిల్స్‌ను సేకరించారు. వీటిని పరీక్షల నిమ్తితం ల్యాబ్‌కు పంపనున్నామని వారు తెలిపారు.
జి.రాగంపేట ఫ్యాక్టరీకి అనుమతి ఉందా ?
అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్ కంపెనీకి మెయిన్ బ్రాంచి సామర్లకోటలో ఉంది. దీని అనుమతులనే చూపుతూ జి.రాగంపేటలో ఫ్యాక్టరీని నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. అనుమతులపై సంబంధిత అధికారులు నేటికీ పెదవి విప్పకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో విచారించి నివేదికను బహిర్గతం చేయాలి
పరిశ్రమల్లో భద్రత డొల్లతనం బయటపడుతూ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అనేకమంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆయిల్ పరిశ్రమలో జరిగిన ఘటన విషయంలోనైనా నివేదికను బయట పెట్టి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రకటించాలి. పరిహారం ఇచ్చేశాం, చేతులు దులుపుకున్నాం అనే ధోరణిలో కాకుండా ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా పూర్తి స్థాయిలో విచారణ సాగేలా చూడాలి. అన్ని పరిశ్రమల్లోనూ పని పరిస్థితులపై కార్మికులను నేరుగా విచారించాలి.
- సిహెచ్ రాజ్‌కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా










