Nov 14,2023 08:48

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆర్థిక నేరాలకు పాల్పడి కస్టడీకి తీసుకున్న వారి చేతికి సంకెళ్లు వేయొద్దని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. బిజెపి ఎంపి బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కొత్త క్రిమినల్‌ చట్టాలకు మార్పులను సూచించింది. భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌) ప్రకారం ఒక ఆర్థిక నేరగాడిని అరెస్టు చేసిన మొదటి 15 రోజులకు మించి పోలీసు కస్టడీలో ఉంచినప్పుడు సంబంధిం చిన మార్పులను సూచించింది. వ్యవస్థీకృత నేరం, ఉగ్రవాద చర్య, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరం లేదా అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం, హత్య, అత్యాచారం, యాసిడ్‌ దాడి, నకిలీ నాణేలు, ఫేక్‌ కరెన్సీ నోట్లతో పట్టుబడటం, మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక నేరాలు ఇలాంటి వాటికి పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈ క్లాజ్‌ వివరణలో మరింత స్పష్టత ఇవ్వడానికి తగిన సవరణ తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. బిఎన్‌ఎస్‌ఎస్‌ క్లాజ్‌ 482లో, 'నిందితుడు మొదటి 15 రోజులకు మించి పోలీసు కస్టడీకి అవసరం కావచ్చు' అనే పదాలను కూడా కమిషన్‌ జోడించింది.