ఎపిపిఆర్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నారాయణరెడ్డి, ప్రసాదరావు

ప్రజాశక్తి - కలెక్టరేట్ (కృష్ణా):ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.నారాయణరెడ్డి, కె.ఎన్.వి. ప్రసాదరావు ఎన్నికయ్యారు. ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలోని ఓ పంక్షన్ హాలులో శనివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా జి.వి.సూర్యనారాయణ, కన్వీనర్‌గా నాతి బుజ్జి, కోశాధికారులుగా పి.నరేష్ కుమార్, ఎ.సుధాకర్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని జడ్‌పి సిఇఒలు, డిప్యూటీ సిఇఒలు, డివిజనల్ అభివృద్ధి అధికారులు, ఎంపిడిఒల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అభినందించారు. 250 మంది ఎంపిడిఒలకు డివిజనల్, జిల్లా అధికారులుగా, 200 మందికి పంచాయితీరాజ్ ఉద్యోగులకు ఎంపిడిఒలుగా ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలకు శాశ్వత భవనాలు మంజూరు చేయాలని, ఎంపిడిఒ పోస్టు పేరును బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బిడిఒ)గా మార్పు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.