Aug 29,2023 16:30

మహబూబాబాద్‌ : భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులకు సబ్సిడీలు కల్పిస్తూ సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. అందులో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం గోపాలగిరిలో పామాయిల్‌ కర్మాగారానికి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం హరిపిరాల గ్రామంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. కాగా, ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో 6,535 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు అవుతున్నది.ఈ ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యంతో నిర్మించేందుకు 82 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 175 కోట్ల వ్యయం అవుతుంది. గంటకు 60 టన్నుల ఆయిల్‌ ఫామ్‌ గెలలను మిల్లింగ్‌ చేసే సామర్థ్యం గల ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అతిపెద్దది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల సుమారు 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ వల్ల పామాయిల్‌ సాగు విస్తీర్ణం పెరగడమే కాక ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉంటుంది.