
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులను అవమానిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి రైతులంటే కనీస గౌరవం లేదని దుయ్యబట్టారు. రైతుబంధు సొమ్మును భిక్షం అంటూ అవమానించిన ఆయనకు, సీఎం కేసీఆర్‌కు మధ్య అసలు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని అంటున్న రేవంత్‌కు వ్యవసాయంపై అవగాహన లేదని విమర్శించారు.
రైతులను సీఎం కేసీఆర్ రాజును చేశారని.. బిఆర్‌ఎస్ పాలనలో భూముల విలువ పెరిగిందన్నారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని కాంగ్రెస్ గొప్పలు చెబుతోంది.. కానీ, అక్కడ 2 గంటల కరెంటు కూడా ఇవ్వట్లేదని స్వయంగా జేడీఎస్ నేత కుమారస్వామి చెప్పారని తెలిపారు. రేవంత్ రెడ్డికి కనీసం హార్స్‌పవర్ అంటే తెలుసా?అని ఎద్దేవా చేశారు. ''కర్ణాటకలో ఎటుచూసినా కరవే కనిపిస్తోంది. కేసీఆర్ పాలనలో గ్రామాల్లో కరవు లేదు.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ లేదు. కేసీఆర్ అంటే నమ్మకం.. ప్రజలకు ఒక భరోసా. మోసాలు చేసే కాంగ్రెస్, బిజెపిని తెచ్చుకోవడం ఎందుకు? రైతుబంధు సాయం ఆపాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వడ్లు సమఅద్ధిగా పండుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ వడ్ల నమూనా మనకు ఎందుకు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి?'' అని మంత్రి హరీశ్ రావు కోరారు.