Oct 31,2023 11:25
  • ఆ పార్టీ విషకౌగిలి నుంచి బయటపడాలి
  • వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు సిపిఎం సూచన
  • సీతంపేట, ఆదోనిల్లో ప్రజారక్షణ భేరి ప్రారంభం

ప్రజాశక్తి-విజయనగరం, కర్నూలు ప్రతినిధులు : బిజెపితో బంధం వినాశనకరమని, ఆ పార్టీ విషకౌగిలి నుంచి వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బయటకు రావాలని సిపిఎం నాయకులు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం బస్సు యాత్రలు ప్రారంభయ్యాయి. ఆదోనిలో ప్రజారక్షణ భేరిని సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే, సీతంపేటలో ప్రచార భేరిని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఆదోనిలో ప్రారంభమైన యాత్ర కర్నూలు వరకూ సాగింది. సీతంపేటలో ప్రారంభమైన యాత్ర పాలకొండ, కురుపాం మీదుగా పార్వతీపురం చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు.
 

                    గిరిజన చట్టాలను కాలరాస్తున్న బిజెపి.. వత్తాసు పలుకుతున్న వైసిపి, టిడిపి : బివి.రాఘవులు

గిరిజన చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఆ ప్రభుత్వానికి రాష్ట్రంలోనే వైసిపి, టిడిపి వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా రావాడ రోడ్డు జంక్షన్‌, పార్వతీపురంలలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గిరిజనులు పోరాడి సాధించుకున్న చట్టాలను సవరించి వారిని దోపిడీ చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే అటవీ హక్కుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. చట్ట ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికీ గరిష్టంగా పది ఎకరాలు వరకు భూమి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ తూతూమంత్రంగా పంపిణీ జరిగిందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కొండ కోనలను ధ్వంసం చేసి అందులో నిక్షిప్తమైన గనులను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదాత్తం చేస్తోందన్నారు. ఇందుకోసం పీసా చట్టానికి విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులను తగినంతగా కేంద్ర ప్రభుత్వం కేటాయించట్లేదని అన్నారు. ఆరకొరగా కేటాయించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు వెయ్యి గిరిజన గ్రామాలు 5వ షెడ్యూల్‌ పరిధిలో లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలోని వారికి ఐటిడిఎ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన బతుకులు నాశనం చేసే ప్రతి చట్టానికి వైసిపి, టిడిపి ఎంపిలు చేతులెత్తి మరీ మద్దతు తెలియజేస్తున్నారని విమర్శించారు. వీటికి తోడు జనసేన పార్టీ కూడా బిజెపితో జతకట్టిందన్నారు. గిరిజనుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ మూడు పార్టీలూ సహాయ సహకారాలు అందిస్తున్నాయని విమర్శించారు. విశాఖలోని రుషికొండను తవ్వేసి రూ.40 కోట్లతో భవనాలు నిర్మిస్తోన్న సిఎం జగన్‌కు రాష్ట్ర అభివృద్ధి, సమస్యలు పట్టడం లేదన్నారు. మత, కుల ప్రాతిపదికన ప్రజలను విభజించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇటీవల మణిపూర్లో చోటుచేసుకున్న పరిణామాలు దీనికి తాజా తార్కాణమన్నారు. మతోన్మాదులకు అవకాశం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజా హక్కులు కాపాడే వారికి, పోరాడే శక్తులు వామపక్షాలు, సిపిఎంకు అవకాశాలు ఇవ్వాలని కోరారు. జగన్‌మోహనరెడ్డి, చంద్రబాబు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారని, అవినీతి నిజమైతే వారు కొట్టేసిన కోట్ల రూపాయలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడేవని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు పోరాడుతున్న చంద్రబాబు గతంలో ప్రజల కోసం పోరాడిన వామపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్‌ కూడా అదే తరహాలో ఉద్యమాలను అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అటువంటి బెదిరింపులు అక్రమ అరెస్టులు కమ్యూనిస్టులకు కొత్త కాదన్నారు. గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసినా భవనాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని తెలిపారు.
 

                                  సాధికార యాత్ర చేపట్టే నైతిక హక్కు వైసిపికి లేదు : వి శ్రీనివాసరావు

రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర చేపట్టే నైతిక హక్కు వైసిపి ప్రభుత్వానికి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అడవులు, భూములు, గనులు వంటి సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో వైసిపి జతకట్టిందని విమర్శించారు. పేదలకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చిన భూములను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో తాగునీరు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలు తగినంతగా లేవన్నారు. పేదలు, గిరిజనులు, రైతుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను కేంద్రం నీరుగారిస్తుంటే చూస్తోన్న వైసిపి... సామాజిక జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రభుత్వం కూడా మోడీ మోసకారి విధానాలకు వంతపాడుతోందని విమర్శించారు. అదానీ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, రెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు.
 

                                          బిజెపిని ఓడించి దేశాన్ని రక్షించుకోవాలి : అశోక్‌ ధావలే

రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించి దేశాన్ని రక్షించుకోవాలని సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రజారక్షణ భేరిని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, కర్నూలులో బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తి గతంలో ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, ఇప్పుడు ఒకటి, ఒకటిన్నర క్వింటాళ్లు మాత్రమే వస్తోందని, అలాంటి దుర్భర పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
         కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అత్యధిక ప్రాంతాల్లో పండే వరికి క్వింటాలుకు కేంద్రం రూ.2,100 మాత్రమే మద్దతు ధర ప్రకటించిందని, కేరళలోని వామపక్ష ప్రభుత్వం రూ.2,850 ఇస్తోందని తెలిపారు. దేశానికి, అసమానతలు లేని అభివృద్ధికి వామపక్షాలే ఏకైక ప్రత్యామ్నాయన్నారు. రాష్ట్రంలోని 679 మండలాల్లో 400కుపైగా మండలాల్లో కరువు ఉందని, వైసిపి ప్రభుత్వం ఇప్పటి వరకూ కరువు మండలాలు ప్రకటించలేదన్నారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం లేదని, కేంద్రం కూడా సాయం చేయడం లేదని అన్నారు. ప్రాజెక్టులు లేకుండా సాగెలా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా ఘోరంగా విఫలం అయ్యారని విమర్శించారు. బిజెపితో వెళ్లే ఏ పార్టీతోనూ సిపిఎం కలిసి వెళ్లదని స్పష్టం చేశారు.
 

                                                  ప్రజలు చైతన్యవంతులు కావాలి : ఎంఎ గఫూర్‌

ప్రజలు అడగకపోతే దొంగలు కొల్లగొడుతూనే ఉంటారని, ప్రజలు చైతన్యవంతులు కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ అన్నారు. మాకేం ఇస్తారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తారా లేదా? ఉపాధి చూపిస్తారా? లేదా? అని నాయకుల చొక్కా పట్టుకొని నిలదీయాలని కోరారు. రాష్ట్రంలో అధికారం కోసం వైసిపి, టిడిపి ఆరాటపడుతున్నాయి తప్ప, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
          రైతుల ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమన్నారు. పంటలు ఎండిపోతుంటే ఆదుకోకుండా మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కమీషన్ల మీద ఉన్న ఆసక్తి రైతుల మీద లేదని విమర్శించారు. సామాజిక సాధికార యాత్రలో సాధికారత ఏముందని, ఒక్క కార్పొరేషన్‌కైనా డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల కోసం త్యాగం చేసి జైలుకెళ్లారా? అని ప్రశ్నించారు. ఎపికి అన్యాయం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన పార్టీ మద్దతు ఇస్తుండడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమేని తెలిపారు. బిజెపితో అంటకాగే వాళ్లను చిత్తుగా ఓడించాలని కోరారు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి డి గౌస్‌ దేశారు తదితరులు పాల్గొన్నారు.