Jul 03,2023 20:45
  • పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి,పిఠాపురం : రాబోయే రోజుల్లో టిడ్కో గృహాల సముదాయ ప్రాంతాన్ని టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చేస్తామని, దగ్గర్లో కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటివి నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోర్స రైల్వేగేటు సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు సోమవారం ఆయన అందజేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సురేష్‌ తొలుత మురుగునీటి శుద్ధి యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. ఇళ్లలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పిఠాపురంలో మొత్తం 864 ఫ్లాట్లను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌, తాగునీరు, డ్రెయిన్లు, మురుగునీటి శుద్ధి యూనిట్‌, సిమెంటు రోడ్లు ఇలా అన్ని సౌకర్యాలూ కల్పించినట్లు వివరించారు. ఆగస్టు మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి టిడ్కో ఇళ్లను అప్పగిస్తామన్నారు. అనంతరం ఎంపి వంగా గీత మాట్లాడుతూ ఎన్నో అవరోధాలను అధిగమించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్లాట్లను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి టిడ్కో చైర్మన్‌ జె ప్రసన్నకుమార్‌, ఎపి టిడ్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిత్తూరి శ్రీధర్‌, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా తదితరులు పాల్గొన్నారు.