Sep 04,2023 22:08
  • స్ధలాన్ని సబ్‌ డివిజన్‌ చేసిన తరువాత రిజిస్ట్రేషన్‌, ఆటో మ్యుటేషన్‌
  • సిసిఎల్‌ఎ సాయి ప్రసాద్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేశంలోని ఉత్తమ పద్ధతులను పరిగణలోకి తీసుకుని, రిజిస్ట్రేషన్‌ సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేశామని, నూతన రిజిస్ట్రేషన్‌ విధానంలో పారదర్శకత, భద్రతకు పెద్దపీట వేశామని సిసిఎల్‌ఎ జి.సాయిప్రసాద్‌ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను 1999లో కంప్యూటరీకరించామని, అప్పటి అవసరాలకు 1.0 వెర్షన్‌ సరిపోయిందని, నేడు కొనుగోలు, అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో 2.0 వెర్షన్‌ ప్రైమ్‌కార్డును తీసుకొచ్చామన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో సోమవారం సిఎం అడిషనల్‌ సెక్రటరీ ఆర్‌ ముత్యాలరాజు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజి వి. రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన సాప్ట్‌వేర్‌ వల్ల కొనుగోలు, అమ్మకందారులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. క్రయ విక్రయాలకు కోర్టులో సాక్ష్యంగా కూడా ఈ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 294 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. వీటితోపాటు మొదటి విడత రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లో పనిచేసే పంచాయతీ సెక్రటరీలకు రిజిస్ట్రేషన్స్‌ చేసే అధికారం లభించిందని చెప్పారు. రెండో విడతలో భూముల రీ సర్వే అక్టోబరు 13కు లక్ష్యాలు పూర్తవుతాయని, ఆయా గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ సెక్రటరీలకు రిజిస్ట్రేషన్లపై శిక్షణ ఇస్తున్నామని, రీ సర్వే పూర్తవగానే ఆయా పంచాయతీ సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలు ఇస్తామని సిసిఎల్‌ఎ జి.సాయిప్రసాద్‌ తెలిపారు. గతేడాది 25లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. డాక్యుమెంట్‌ నచ్చిన రీతిలో రాసుకునే అవకాశం నూతన సాప్ట్‌వేర్‌లో కూడా ఉండడంతోపాటు లింక్‌ డాక్యుమెంట్లను చూసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, స్టాంప్‌ డ్యూటీ కూడా ఆటోమేటిక్‌గా భూమికి సర్వే నెంబరు నమోదు కాగానే ఆయా ప్రాంతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదు చేసిన మార్కెట్‌ ధర డిస్‌ప్లే అవుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఆటోమ్యుటేషన్‌ కూడా జరుగుతుందని, స్థలాన్ని సబ్‌ డివిజన్‌గా మార్చిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని సిసిఎల్‌ఎ వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇసి, రెవెన్యూ రికార్డ్సు ఇవ్వడం జరుగుతుందని, సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద స్కాన్‌ చేసిన డాక్యుమెంట్‌ మాత్రమే ఉంటుందని తెలిపారు. ఐటి యాక్ట్‌ 2000 ప్రకారం ఎలక్ట్రానిక్‌ సిగేచర్‌ చేసిన డాక్యుమెంట్స్‌ చెల్లుతాయని తెలిపిందని సిసిఎల్‌ఎ పేర్కొన్నారు. నూతన సాప్ట్‌వేర్‌పై అవగాహన లేని వారు మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి జెరాక్స్‌ కాపీలంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజి వి.రామకృష్ణ ఖండించారు. కొత్త సాప్ట్‌ వేర్‌ వల్ల కొనుగోలు, అమ్మకందారులకు ఎంతో లాభం చేకూరుతుందని తెలిపారు.