
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాలల్లోని తరగతి గదుల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు కూడా ఫోన్లను తరగతి గదిలోకి తీసుకెళ్లకూడదని పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్లను సైలెంట్‌లో ఉంచాలని, బయోమెట్రిక్ హాజరు వేసిన వెంటనే ఫోన్లను ప్రధానోపాధ్యాయులకు అప్పగించాలరని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల ప్రకారం బోధనా ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు ఫోన్‌ను ఉపయోగించాలనుకుంటే ఫోన్ వినియోగ వివరాలు తప్పనిసరిగా పాఠ్యప్రణాళికలో వివరంగా రాసి, ప్రధానోపాధ్యాయులతో ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్ధులు తరగతి గదుల్లోకి ఎట్టి పరిస్థితిల్లోనూ ఫోన్లను తీసుకురాకూడదు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.