- రెండో దశలో ఏటికొప్పాక, తాండవ సుగర్ ఫ్యాక్టరీల అమ్మకం?
- నోరు విప్పని మంత్రి అమర్‌నాథ్
- ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాక అమ్మకపు ప్రక్రియ !
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : తుమ్మపాల (అనకాపల్లి వివి రమణ కో - ఆపరేటివ్) సుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సుగర్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ అంశం రైతుల్లో తొలగిపోవడంతో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పల్లవి అందుకొని ప్రచారంలో పెట్టింది. ఎన్నికల ప్రచారంలో సహకార సుగర్ ఫ్యాక్టరీలను ఆధునికీకరిస్తామని నమ్మించిన జగన్మోహన్‌రెడ్డి... అధికారం చేతికొచ్చాక ఏటికొప్పాక, తాండవ సుగర్ ఫ్యాక్టరీల క్రషింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి, రైతులకు దారీతెన్నూలేకుండా చేశారు. తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలను ఒకేసారి అమ్మకానికి పెడితే జనంలో తిరగలేమనుకొని వాటిని ఒక్కొక్కటిగా అమ్మాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రూ.450 కోట్లకు పైబడి స్థిరాస్తులు కలిగిన ఫ్యాక్టరీ ఆస్తులను అంచనా వేసేందుకు ప్రత్యేకంగా లిక్విడేటర్‌ను ప్రభుత్వం నియమించింది. లిక్విడేటర్ నియామకంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నా అనకాపల్లి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాత్రం నోరువిప్పడంలేదు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక ఫ్యాక్టరీ అమ్మకపు ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. టిడిపి ప్రభుత్వ కాలంలో తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని ఆ పార్టీ నాయకుడు ఎంవివిఎస్.మూర్తికి విక్రయించాలని చేసిన ప్రయత్నాలను రైతులు అడ్డుకున్నారు. తరువాత విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావుకు కట్టబెట్టాలని చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. ఫ్యాక్టరీ అమ్మకాలను ఆనాడు వ్యతిరేకించిన వైసిపి, ఇప్పుడు తుమ్మపాల సుగర్‌ను అమ్మకానికి పెట్టనుంది. ఫ్యాక్టరీలో రైతుల షేర్లు కంటే ప్రభుత్వ షేర్లు తక్కువ కావడంతో కో - ఆపరేటివ్ సుగర్ యాక్ట్ ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తుల అమ్మకానికి అవకాశంలేనప్పటికీ, ఈసారి ఎలాగైనా విక్రయించి సొమ్ముచేసుకోవాలన్న యోచనలో ప్రభుత్వమున్నట్లు తెలుస్తోంది.
ఇదీ ఫ్యాక్టరీ చరిత్ర
1935లో 50 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఏర్పాటై, వెయ్యి టన్నుల సామర్థ్యానికి తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ విస్తరించింది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో 9 మండలాలకు చెందిన 151 గ్రామాల నుంచి రైతులు చెరకు సరఫరా చేసేవారు. తమ వాటా కింద 12,769 మంది రైతులు రూ.కోటీ 36 లక్షలా 81 వేలా 300ను పెట్టారు. దీంట్లో ప్రభుత్వ షేర్ కేవలం లక్ష రూపాయలుండడంతో పథకం ప్రకారం తమ వాటాను పెంచుకొనే ప్రయత్నంలో భాగంగా, ఫ్యాక్టరీ మరమ్మతులు, రైతుల బకాయిల నిమిత్తం ఇచ్చిన రూ.19 కోట్లా 52 లక్షలా 43 వేల రుణాన్ని తన షేర్ కింద మార్చుకుంది. మరో రూ.20.45 కోట్లను అప్పు కింద కింద ప్రభుత్వం చూపుతోంది. అన్నీ సక్రమంగా ఉన్న కాలంలో క్రషింగ్ సీజన్ ముగిశాక ప్రభుత్వ మందుల కంపెనీ ఐడిపిఎల్ సహకారంతో స్థానికంగానే పారాసెట్మాల్ సహా మరో రెండు ట్యాబ్లెట్లు తయారుచేసి ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే ఖ్యాతిని నాడు తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ గడించింది. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో మందుల తయారీ ఆగింది. తరువాత డిస్టలరీ యూనిట్ మూతపడింది. తొలుత 2015-16లో అప్పటి ప్రభుత్వం చెరుకు క్రషింగ్ ఆపింది. 2018-19 సీజన్‌లో తెరచి మళ్లీ క్రషింగ్ నిలిపివేసింది. ఇపుడా ప్యాక్టరీని చెరుకు రైతుల అవసరాలకు తగినట్లు ఈ ప్రభుత్వం ఆధునీకరించకపోగా గుండగుత్తుగా అమ్మకానికి పెడుతుండడం విమర్శలకు తావిస్తోంది.
నమ్మక ద్రోహం
తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టే చర్యలను ప్రభుత్వం మానుకోవాలి. టిడిపి ప్రభుత్వం నుంచి వైసిపి ప్రభుత్వం వరకూ రైతులకు ద్రోహం చేస్తూనేవున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని కొంతకాలంగా చెప్పి ఇప్పుడు అమ్మకానికి పెట్టడం నమ్మక ద్రోహం. రైతుల ఆమోదం, జనరల్‌బాడీ సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా లిక్విడేటర్‌ను నియమించడం సరికాదు. ప్రభుత్వ చర్యలను రైతు సంఘాల నేతలు, కార్మికులు ఐక్యంగా పోరాడి అడ్డుకుంటారు. ప్రభుత్వం వెనక్కుతగ్గకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
- ఎ.బాలకృష్ణ, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి










