
34కి పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య
న్యూఢిల్లీ : గురువారం ముగ్గురు కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు స్వాగతించింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని సముపార్జించుకున్నట్లైంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్, గువహటి ప్రధాన న్యాయమూర్తులు అగస్టీన్ జార్జి మసిహ్, సందీప్ మెహతాలు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వారి పేర్లను కొలీజియం సిఫార్సు చేసిన మూడు రోజుల్లోపే ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. కాగా, కేవలం అక్టోబరు మాసంలోనే దాదాపు 5 వేల కేసులు దాఖలయ్యాయి. కాగా మరోవైపు రాబోయే 24 గంటల్లో పెండింగ్ కేసులు 80వేలకు చేరనున్నాయని జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జెడిజి) డాష్ బోర్డ్ తెలియచేస్తోంది. నవంబరు 9 సాయంత్రానికి నమోదైన, నమోదు కాని కేసుల సంఖ్య 79,717కి చేరినట్లు సుప్రీం కోర్టు వెబ్‌సైట్ పేర్కొంటోంది. వీటిలో 24,834 కేసులు ఏడాది కాలం లోపలవే. అక్టోబరులో మొత్తంగా 4,915 కేసులు నమోదు కాగా, 4,454 కేసులు పరిష్కారమయ్యాయి. 2023లో ఇప్పటివరకు మొత్తంగా 47,135 కేసులు నమోదు కాగా, 46,193 కేసులు పరిష్కారమయ్యాయి. సుప్రీం కోర్టులో నెంబరు 2 స్థానంలో వున్న జస్టిస్ సంజరు కిషన్ కౌల్ డిసెంబరు 25న రిటైరవనున్నారు. అప్పటివరకు 34మంది న్యాయమూర్తులతో పూర్తి స్థాయి సామర్ధ్యంతో సుప్రీం పనిచేస్తుంది.