Sep 19,2023 16:04
  • ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వన్డేల్లో 20 నెలల తర్వాత మళ్లీ చోటు దక్కించుకున్నాడు. ఈనెల 22నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేలకు భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) జట్టును ప్రకటించింది. ఇందులో అశ్విన్‌కు చోటు దక్కగా.. మూడో వన్డేకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. 37ఏళ్ల అశ్విన్‌ 2022, జనవరిలో దక్షిణాఫ్రికాతో చివరిసారిగా వన్డేల్లో ఆడాడు. కెరీర్‌లో 113వన్డేలు ఆడిన అశ్విన్‌.. 33.49 యావరేజ్‌తో 151వికెట్లు తీశాడు. అలాగే 63ఇన్నింగ్స్‌లో 707పరుగులు చేశాడు. 2010లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన అశ్విన్‌ 2011లో వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన భారతజట్టులో సభ్యుడు. వరల్డ్‌ కప్‌ ముందు సొంత గడ్డపై సెప్టెంబర్‌ 24న ఆసీస్‌తో వన్డే సిరీస్‌ షురూ కానుంది. ఇక ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, విరాట్‌ కోహ్లీ, కుల్దీప్‌ యాదవ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ రెండు మ్యాచుల్లో కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత నవంబర్‌ 23నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టి20ల సిరీస్‌ జరగనుంది.

సూర్యకుమార్‌కూ కీలకమే..

మిస్టర్‌ 360డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కూ ఈ సిరీస్‌ కీలకంగా మారనుంది. ఆసీస్‌ చేతిలో గోల్డెన్‌ డక్స్‌తో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అప్పట్లో సూర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే.. మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. సంజూ శాంసన్‌ను కాదని వరుసగా చాన్స్‌లు ఇస్తోంది. కోచ్‌, కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సూర్య నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ క్రమంలో సూర్యకుమార్‌... ఈసారి ఆసీస్‌పై ఎలా రాణిస్తాడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌.. ఆస్ట్రేలియా బౌలర్లపై విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడితే వన్డే చోటు ఖాయం కానుంది.
తొలి రెండు వన్డేలకు భారతజట్టు : కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, సిరాజ్‌, షమీ, తిలక్‌ వర్మ, ప్రసిధ్‌ కృష్ణ, అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌.

వన్డే సిరీస్‌..

22(శుక్ర) : తొలి వన్డే(మొహాలీ)
24(ఆది) : రెండో వన్డే(ఇండోర్‌)
27(బుధ) : మూడో వన్డే(రాజ్‌కోట్‌)