Oct 05,2022 17:07

స్టాక్‌హౌం: రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి లభించింది. క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది.
గతేడాది రసాయన శాస్త్రంలో నోబెల్‌ అవార్డుకు ఇద్దరు ఎంపికకాగా ఈసారి ముగ్గురు విజేతలుగా నిలిచారు. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్‌ అభివృద్ధి చేసినందుకు గాను 2021లో బెంజిమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిల్లన్‌లకు ఈ అవార్డు దక్కింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణహితంగా మార్చిన ఆ విధానం మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని సెలక్షన్‌ కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటివరకు వైద్య విభాగంతోపాటు భౌతిక, రసాయనశాస్త్రాలలో నోబెల్‌ బహుమతుల విజేతలను ప్రకటించారు. ఆర్థిక రంగం, సాహిత్యం, శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంది. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.
మరో విశేషమేంటంటే.. ఈఏడాది పురస్కారానికి ఎంపికైనన జాబితాలో ఉన్న బ్యారీ షార్ప్‌లెస్‌.. రెండుసార్లు నోబెల్‌ బహుమతి అందుకున్న ఐదో వ్యక్తిగా ఘనత సాధించనున్నారు. 2001లో బ్యారీ షార్ప్‌లెస్‌ ఒకసారి నోబెల్‌ పురస్కారం పొందగా ఈ ఏడాది రెండోది అందుకోనున్నారు. ఇప్పటివరకు నోబెల్‌ బహుమతులను జాన్‌ బర్డీన్‌, మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యూరీ, లైనస్‌ పాలింగ్‌, ఫ్రెడెరిక్‌ సాంగర్‌లు రెండుసార్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు.