Feb 14,2023 21:32

వాషింగ్టన్‌ : బహుళజాతి కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ తమ వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో యూరప్‌లో 3,800 మంది ఉద్యోగులుపై వేటు వేయనున్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితులు, మార్కెట్‌లో విద్యుత్‌ కార్ల డిమాండ్‌ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నామని ఆ కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలోనే జర్మనీలో 2,300 మందిని, బ్రిటన్‌లో 200 మందిని ఇంటికి పంపించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం యూరప్‌లో మొత్తం 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికల్లా యూరప్‌ అంతటా విద్యుత్‌ కార్లను అమ్మాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్‌ కారును విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఆర్థికంగా సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలను గాడిలో పెట్టే ఉద్దేశ్యంతోనే ఉద్యోగుల కోత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందుకోసం సాధ్యమయినంత వరకు స్వచ్ఛంద విరమణ కార్యక్రమాన్ని తీసుకోనున్నామని తెలిపింది. విద్యుత్తు వాహన తయారీ దిశగా అడుగులు వేస్తున్నందున ఇంజినీర్ల సంఖ్య పెద్దగా అవసరం ఉండకపోవచ్చునని అభిప్రాయపడింది.