ఆడుతూ పాడుతూ, అప్పటి వరకు తమ కళ్ల ముందే తిరుగుతున్న పిల్లలు ఒక్కసారిగా కనిపించకుండా పోయినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎటు వెళ్లారో.. ఏమై పోయారో తెలియని తమ ముద్దు బిడ్డల ఆచూకీ కోసం తల్లిదండ్రులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని వెతుకుతారు. వీధులన్నీ తిరుగుతారు. పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినా.. తమ వంతుగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు గాలిస్తుంటారు. అలా కనిపించకుండా పోయిన పిల్లలను తల్లిదండ్రుల దగ్గరకు చేరుస్తున్నారు హిమాన్షు నాగ్‌పాల్. ఉత్తరప్రదేశ్ వారణాసి ఐఎఎస్ అధికారిగా ఎన్నో పనులతో తీరిక లేకుండా ఉండే ఈయన, తప్పిపోయిన పిల్లలను వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడంలో విశేష కృషి చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లా ఓ కుగ్రామంలో బార్బర్ షాపులో పనిచేస్తున్నాడు 12 ఏళ్ల షోయబ్. రోజూ షాపుకు వెళ్లి రావడం అతని దినచర్య. ఒక రోజు షాపు పక్కనే ఉన్న బస్ స్టేషనుకు వెళ్లి, ఓ బస్సులో ఎక్కి కూర్చొన్నాడు. బస్సు చివరి స్టాపు వరకు షోయబ్ దిగలేదు. అసలు ఆ బస్సు షోయబ్ ఎక్కాల్సింది కాదు. తీరా బస్సు దిగాక, అతను చేరాల్సిన గమ్యం ఎక్కడో చెప్పలేక పోయాడు. అక్కడితో ఆగక కొన్ని రోజులపాటు బస్సులు, రైళ్లలో ప్రయాణించి తను ఉన్న ప్రాంతానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని వారణాసికి చేరుకున్నాడు. వెనక్కి వచ్చే మార్గం తెలియక, అక్కడే రైల్వే స్టేషనులో యాచన చేస్తూ గడుపుతున్నాడు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న షోయబ్‌ను బార్బర్ షాపుకు తీసుకెళ్లడం, తీసుకురావడం అతని సోదరుడి రహీమ్ పని. ఆ రోజు సోదరుడు రాకముందే షోయబ్ బయటికి వచ్చేసి బస్సు ఎక్కేశాడు. తమ్ముడి కోసం అన్న ఎంత ఆరా తీసినా ఆచూకీ తెలియలేదు. ఇదంతా 2019లో జరిగిన సంగతి.

ఈ నాలుగేళ్లలో షోయబ్ కుటుంబం ఎంతో వేదన అనుభవించింది. కొడుకును తలచుకుని ఆ తల్లి ఏడ్వని రోజు లేదు. అసలు బతికున్నాడో.. లేదోనన్న భయం ఆ కుటుంబాన్ని వెంటాడింది. ఈ పరిస్థితుల్లో.. రహీమ్‌కు ఈ ఏడాది జనవరిలో స్థానిక పోలీస్ స్టేషను నుంచి ఫోను కాల్ వచ్చింది. షోయబ్ ఆచూకీ తెలిసిందన్నది దాని సారాంశం. వీడియో కాల్‌లో షోయబ్‌ను చూసినప్పుడు ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. షోయబ్ తల్లి ఏడుస్తూనే ఉంది.
ఇలా షోయబ్ ఒక్కడే కాదు.. సుదూర ప్రాంతాల నుండి వారణాసికి చేరుకున్న చిన్నారుల్లో 700 మందికి పైగా బాలలను తిరిగి తమ గమ్యస్థానాలకు చేర్చడంలో హిమాన్షు పాత్ర ఎంతోవుంది. చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే లక్ష్యంగా 'మిషన్ ముస్కాన్'ను ప్రారంభించారు.
యాచన వృత్తిలో వందల మంది చిన్నారులు
హర్యానా హిస్సార్ జిల్లాకు చెందిన హిమాన్షు 2019 ఐఎఎస్ బ్యాచ్ అధికారి. గతేడాదే వారణాసి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సిడిఒ)గా బాధ్యతలు తీసుకున్నారు. విధుల్లో భాగంగా నగరంలో పర్యటిస్తున్న ఆయనకు ట్రాఫిక్ కూడళ్ల వద్ద చిన్నారులు యాచించడం కనిపించింది. కాశీ వ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఘాట్లలో కూడా చాలా మంది పిల్లలను ఆయన గమనించారు. వారి దగ్గరకు వెళ్లి వివరాలు అడిగితే ఇక్కడి వారు కాదని తెలిసింది. ''ఫ్లైఓవర్ కింద ఉంటున్నామని, అమ్మానాన్న ఎక్కడ ఉంటారో తెలియదని ఆ పిల్లలు చెప్పినప్పుడు చాలా బాధేసింది. ఐదేళ్లుగా ఉంటున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణా, ఆంధ్ర, కర్నాటక, అసోం రాష్ట్రాలతో పాటు నేపాల్ దేశం నుండి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు' అని చెప్పారు. హిమాన్షు. ఆ వెంటనే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అధికారులంతా ఏకమై..
పిల్లలను వారి కుటుంబాలకు చేరవేసేందుకు 'చైల్డ్ డెవలప్‌మెంట్', 'సోషల్ వెల్ఫేర్', 'యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్', 'పోలీస్' విభాగాల నుండి 60 మంది అధికారులను ఒకచోట చేర్చారు. వీరంతా బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఘాట్లు, గుళ్లు, ట్రాఫిక్ కూడళ్లు, ఫైఓవర్స్ దగ్గర ఉన్న పిల్లలను గుర్తించే పనిలో నిమగమయ్యేలా కార్యాచరణ రూపొందించారు.
మానసిక వైకల్యంతో బాధపడే వారి పిల్లలతో మాట్లాడేందుకు మానసిక వైద్యులను కూడా ఇందులో భాగం చేశారు. పిల్లలు చెప్పిన వివరాలను బట్టి ఆయా రాష్ట్రాల స్థానిక జిల్లా పోలీస్ స్టేషన్లకు పిల్లల వివరాలు, ఫొటోలు పంపిస్తున్నారు. వారణాసి వచ్చి పిల్లలను తీసుకెళ్లలేని పేద కుటుంబాల పిల్లలను హిమాన్షు తన సొంత ఖర్చులతో ఇంటికి చేరుస్తున్నారు.

ఆచూకీ తెలిసేవరకు పిల్లల సంరక్షణ
వివరాలు తెలియని పిల్లల బాగోగులు పట్టించుకోవడంలో కూడా హిమాన్షు కృషి ఎంతో ఉంది. 20 స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో మాట్లాడి, ఆ పిల్లలను అక్కడకు చేర్చారు. వారికి ఆహారం, బట్టలు, వసతితో పాటు నాణ్యమైన విద్య అందేలా చూస్తున్నారు. పిల్ల్లల అభిరుచులను బట్టి వివిధ రకాల కళల్లో శిక్షణ ఇస్తున్నారు. జిల్లా యంత్రాంగం నుండి నిధులు సేకరించి మరీ స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నారు.
'5 నుండి 15 రోజుల వ్యవధిలో పిల్లలను వారి కుటుంబాలకు అందజేస్తున్నాం. మానసిక వైకల్యంతో బాధపడే పిల్లల ఆచూకీ కోసం వారి చేతివ్రేళ్ల ముద్రల సాయంతో ఆధార్ అడ్రస్ తెలుసుకుని పంపిస్తున్నాం. షోయబ్ విషయంలో అలాగే చేశాం. బిడ్డలు తిరిగి తమ ఇళ్లకు చేరిన క్షణంలో ఆ కుటుంబాల్లో కనిపిస్తున్న ఆనందం చూస్తుంటే చాలా సంతోషమేస్తోంది. 5 నుండి 18 ఏళ్ల పిల్లల్లో చాలామందిని వారి స్వస్థలాలకు పంపించాం. ఇది నిరంతరం జరిగేలా ప్రణాళికలు వేస్తున్నాం. ఏ బిడ్డా ఇంటికి దూరం కాకూడదు.' అంటున్న హిమాన్షు లాంటి అధికారులు పెద్ద అధికారులే కాదు, పెద్ద మనసున్న వారు కూడా.










