Jun 26,2023 10:36

ఇప్పుడు మిద్దె తోట అనేది ఆరోగ్యంలో భాగమైంది. ఎండలు తగ్గి, వర్షాలు పడుతున్నాయి. మిద్దె మీద సాగుకు అనువైన సమయం ఇదే. రసాయనాలతో పండించిన కూరగాయలు తినడం కన్నా సహజసిద్ధంగా పండించినవి తినడంపై దృష్టి పెడుతున్నారు చాలామంది. దాంతో పాటు బయట కూరగాయల ధరలూ పెరుగుతున్నాయి. అదే మన ఇంటిపై, ఖాళీ ప్రదేశంలో కూరగాయలు, పూల మొక్కలు పెంచితే ఆరోగ్యంతో పాటు వంటింటి ఖర్చులూ కాస్త తగ్గుతాయి. చేసేవారికి కూడా మనసుకు ఇష్టమైన మంచి వ్యాపకం మిద్దె మీది సాగు. మిద్దె మీద సాగు ఎలా చేయాలో నిపుణులు సూచనలు ఇస్తున్నారు.
 

                                                                           మట్టి మిశ్రమం

మిద్దె తోట సాగుకు ఎర్ర మట్టి లేదా నల్ల మట్టిని వాడాలి. మొరం లేదా చప్పుడు మట్టి పనికి రాదు. తేమగా, ముదురు ఎర్రగా, నల్లగా ఉండే మట్టి మొక్కలకు బాగుంటుంది. ఈ మట్టిలో సారవంతమైన నల్లమట్టి కూడా కొంత కలపాలి. ఇసుక శాతం తక్కువ ఉండాలి. కోకోపిట్‌, వేప పిండిని ఈ మట్టిలో బాగా కలిపి ఉంచుకోవాలి. లేదా స్వయంగా తయారుచేసిన ఎరువులను కలపాలి. దానికి పశువుల పేడ, ఎండిన వేప ఆకులతో కంపోస్టు ఎరువు చేయొచ్చు. ఇది మొక్క ఆరోగ్యంగా పెరగటానికి, కూరగాయలు విరివిగా పండటానికి ఉపయోగపడుతుంది.
           - ఈ మట్టిని ఇటుక మడుల్లో, సిమెంట్‌ లేదా మట్టి కుండీల్లో, లేదా పాత బకెట్లలో వేశాక మిగిలినది ఒక మూలన నిల్వ చేసుకోవాలి. అలా నిల్వ చేసిన మట్టిపై ఏదైనా షీట్‌ వేయాలి. అవసరం అయినప్పుడు ఆ మట్టిన వాడుకోవాలి. ముందుగానే ఇలా మట్టిని నిల్వ చేసుకోకపోతే, తర్వాత అవసరం అయిన వెంటనే సారవంతమైన మట్టి దొరకదు.
 

                                                                            కుండీలు ఇలా ...

మట్టి కుండీలు, ప్లాస్టిక్‌ బకెట్లు, సంచులు, వెడల్పు ఉన్న టబ్బులు, గ్రోబ్యాగులు, పెయింట్‌ బక్కెట్లు, సిమెంట్‌ కుండీలు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని మొదట శుభ్రంగా నీళ్లతో కడిగి, ఎండబెట్టాలి. ప్రతి కుండీకి అడుగుభాగాన చిన్న రంధ్రం ఉండేలా చూసుకోవాలి. పెద్ద బకెట్లకు ఇరువైపులా రెండు రంధ్రాలు చేయాలి. ఆ తర్వాత మట్టి పోయాలి. కుండీలో నీరు ఎప్పుడూ నిల్వ ఉండకూడదు. అడుగుభాగాన నుంచి నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మొక్క లోపల మురిగి చనిపోయే ప్రమాదముంటుంది.
 

                                                                      నాణ్యమైన విత్తనాలతో ...

నాణ్యమైన విత్తనాలనే వాడాలి. మొదట్లో కొంచెం ఎక్కువ ఖర్చు అనిపించినా, ఆ పెట్టుబడి వృథా పోదు. మిద్దె తోట పెంచాలనుకునే వాళ్ళు ముందుగా ఆకుకూరలతో మొదలుపెడితే బాగుంటుంది. విత్తనాలు పెట్టిన 15 నుంచి 20 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. అలా చేయడం వల్ల అనుభవం వస్తుంది. తర్వాత టమోట, బెండ, వంగ, చిక్కుడు, మిరప వంటి కూరగాయల విత్తనాలు పెడితే ఇంటికి సరిపడా కూరగాయలు వస్తాయి.
          ఈ మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పోయాలి. దాంతో పాటు వంటగదిలో వచ్చే వేస్ట్‌ డీకంపోజర్‌, కడిగిన బియ్యం నీళ్లు, పులిచిన మజ్జిగ వంటివి పోస్తూ ఉంటే మొక్కలకు బలం అంది త్వరగా పంటను ఇస్తాయి. అవసరాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి సాగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సూచనలూ సలహాలూ యూట్యూబ్లో అందుబాట్లో ఉంటాయి.