Oct 12,2022 10:12
  • ధర్మాధికారి కమిటీ ఆదేశాల అమలుకు 2 వారాల గడువు
  • తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాయి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై తమ తీర్పును ఉల్లంఘించినందుకు శిక్షా కాలాన్ని ప్రకటించే ముందు, చివరి అవకాశంగా జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ ఆదేశాలు అమలు చేయడానికి రెండు వారాలు గడువు ఇస్తున్నామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తీర్పును తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించాయని, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని తాము శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఏ మేరకు ఆదేశాలు అమలు చేశాయో సమీక్షించడానికి తదుపరి విచారణ ఈ నెల 31న చేపడతామని తెలిపింది.
           తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీం కోర్టు జస్టిస్‌ ధర్మాధికారి కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 655 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు, ఎపికి తెలంగాణ నుంచి 655 మంది ఉద్యోగులను పంపాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులతో ఎపి నుంచి వెళ్లినవారిలో 571 మందికే తెలంగాణ విద్యుత్‌ సంస్థలు పోస్టింగు ఇచ్చి, 84 మందిని అదనంగా పంపారని పేర్కొన్నాయి. దీంతో ఈ నెల 84 మంది ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయిం చారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డా యని ఆరోపించారు. ఈ పిటిషన్లను జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎఎస్‌ బోపన్నతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం 54 పేజీల తుది తీర్పు వెలువరించింది. '84 మంది పిటిషనర్లలో, 28 మంది టిఎస్‌జెన్‌కో, 35 మంది టిఎస్‌ ట్రాన్స్‌కో, 21 మంది టిఎస్‌ డిస్కమ్స్‌లో విలీనం చేయాల్సి ఉంది. వీరిని ఎపి విద్యుత్‌ సంస్థలు రిలీవ్‌ చేయడంతో పాత సంస్థతో ఆయా ఉద్యోగులకు ఎలాంటి సంబంధాలు లేవు. జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ తుది నివేదిక సుప్రీం కోర్టు ఆమోదించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు దానికి బాధ్యత వహించాల్సిందే. ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలని చూస్తే కోర్టు ఆదేశాలు ఉల్లంఘిం చినట్లే' అని స్పష్టం చేసింది. 'కోర్టు ఆదేశాలు పట్ల తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపినట్లు పరిగణిస్తున్నాం. వాటిని దోషులుగానూ పరిగణిస్తాం. తగిన శిక్షకు కూడా గురవుతారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు అమలు చేయడానికి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాం. ఎపి నుంచి రిలీవ్‌ అయిన 84 మంది ఉద్యోగులు నాటి నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. ఈ 84 మంది ఉద్యోగులకు రిలీవ్‌ అయిన రోజు నుంచి వేతనాలు, ఇతర సేవా ప్రయోజనాలు చెల్లించడానికి రెండు వారాలు గడువు ఇస్తున్నాం' అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.