Jun 20,2023 08:16

స్కూళ్లు తెరిచారు. చాలామంది పిల్లలు బడికెళ్లిపోతున్నారు కూడా. కొంచెం పెద్ద పిల్లలైతే పరవాలేదు.. మరి ఈ సంవత్సరమే స్కూలుకెళుతున్న పిల్లలైతే.. వారి తల్లిదండ్రులు కొన్ని విషయాలపై శ్రద్ద పెట్టాలి. ఇప్పటి వరకు అమ్మ ఒడిలో ఆడుకున్న పాపాయిలు.. నానమ్మ గోరుముద్దలు తిన్న బుజ్జాయిలు.. తాత, నాన్న గారాలపట్టీలు ఒక్కసారిగా స్కూలు వాతావరణం చూసి బెంబేలు పడిపోవచ్చు. ఆ బెంగ కొంతమందికి ఒకపట్టాన వదలదు. స్కూలుకు వెళ్లనని మారాం చేయవచ్చు.. ఆరోగ్యం పాడై నీరసించి పోవచ్చు. అందుకే పిల్లలను ముందు నుంచే సిద్దం చేయాలి. అలాగే వారి ఆహార, అలవాట్లలో కూడా మార్పులు చేయాలి.
 

                                                                         అలవాటు చేయండి..

  • సమయానికి నిద్ర లేవడం ఆలస్యం చేయకుండా నేర్పించండి.
  • ఉదయం పనులు చకచకా చేసుకునేలా నచ్చజెప్పండి.
  • అలాగే స్కూల్లో తినే ఆహారపదార్థాలు ఆరోగ్యానికి మేలు చేసేలా చూడండి. వాళ్లు ఇష్టపడతారని హానికరమైన చాక్లెట్లు, బిస్కెట్లు, డీప్‌ ఫై ఐటమ్స్‌ పెట్టకూడదు.
  • సాధ్యమైనంతవరకు ఉదయం వేళే.. ఇంట్లో ఉన్నప్పుడే గుడ్డు పెట్టేయండి. పాలు తాగించేయండి.
  • స్నాక్‌ బాక్స్‌లో తేలికపాటి అల్పాహారం సిద్దంచేయండి. ఇడ్లీ, దోశ, ఆమ్లేట్‌ పెట్టొచ్చు. బ్రెడ్‌, జామ్‌ వద్దు.

 

                                                                        సొంతంగా తినేలా..

  • వాళ్లకై వాళ్లు తీసుకుని తినేలా ఇంటి దగ్గరే నేర్పించాలి.
  • అందరు పిల్లలకూ స్పూన్‌తో తినడం అలవాటుండదు. స్కూల్లో ఒక్కసారే తినమంటే తినకుండా ఉండిపోతారు. కాబట్టి ఇంటిదగ్గరే వాళ్లంతట వాళ్లే స్పూన్‌తో తినేలా అలవాటుచేయాలి.

                                                                            ప్లాస్టిక్‌ వద్దు..

  • నీళ్ల బాటిల్స్‌ పై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి స్టీలు, కాపర్‌ బాటిళ్లను ఉపయోగించాలి. స్నాక్స్‌, లంచ్‌ బాక్సులకు కూడా ప్లాస్టిక్‌ వాడొద్దు.
  • స్కూలుకెళ్లడం ఇష్టపడాలని వాళ్లు అడిగిందల్లా కొనివ్వద్దు.

                                                                                రక్షణగా..

  • వేసవి ఎండకు తోడు ఇప్పుడు వడగాలులు వీస్తున్నాయి. హాఫ్‌ డే స్కూల్సు నడుస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళ పిల్లలను తీసుకురావాల్సి వస్తోంది. ఈ సమయంలో వేసవి ప్రతాపం వారిపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  •  మెత్తటి చున్నీ, టోపీ, గొడుగు వంటివి తలచుట్టూ కప్పి వుంచేలా రక్షణగా పెట్టి ముక్కు, చెవుల్లోకి గాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

                                                                      తల్లిదండ్రులు కూడా..

పిల్లలను ఇప్పుడే స్కూలుకు పంపిన కొత్త తల్లిదండ్రులకు కూడా స్కూలు బెంగ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారో.. ఏం తింటున్నారో.. అని ఒకటే ఆందోళనపడిపోతారు.

  • కొంతమంది అతి జాగ్రత్తకు పోయి పిల్లలను స్కూల్లో దింపిన తరువాత కూడా ఒక్కపూటే కదా అని అక్కడే ఉండిపోతారు.
  • ఇలా చేయడం వల్ల పిల్లలు స్కూలుకు త్వరగా అలవాటు పడరు. పైగా మాటిమాటికీ బయటికి వచ్చేస్తుంటారు. ఇది వారి క్రమశిక్షణను పాడుచేస్తుంది.
  • స్కూలు వాతావరణం, అక్కడి నియమాలు పిల్లలకు అలవాటవ్వాలంటే వారిని స్కూల్లో దింపేసి వచ్చేయాలి.
  • స్కూలు నుండి ఇంటికి తీసుకురాగానే ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్‌లు ఇలా వాళ్లు అడిగిందల్లా ఇచ్చేస్తుంటారు. ఇది వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగుతో కూడిన ఆహారం పెట్టాలి. ఈ సూచనలు పాటిస్తూ.. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్కూళ్లకు సిద్దంకండి.