Sep 08,2023 09:08
  • సహకార విస్తరణే లక్ష్యం
  • ఆసియాన్‌తో కలిసి పనిచేస్తాం
  • సదస్సులో 12 సూత్రాలను ప్రతిపాదించిన మోడీ

జకార్తా : స్వేచ్ఛ, పారదర్శకతలతో కూడిన ఇండో-పసిఫిక్‌ ప్రాంతం దిశగా పురోగమించాలని, అంతర్జాతీయ పేద దేశాల వాణిని వినిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ఆసియాన్‌, భారత్‌ మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవాల్సిన అవసరముందని అన్నారు. మూడు రోజుల ఆసియాన్‌ సమ్మిట్‌ చివరి రోజు సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా 12 పాయింటతో కూడిన ప్రతిపాదనలను ఆయన సదస్సుకు అందచేశారు. అనుసంథానత, వాణిజ్యం నుండి డిజిటల్‌ పరివర్తన వరకు వివిధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించారు. అభివృద్ధికి కేంద్రంగా ఆసియాన్‌ వుందని, భారత్‌, ఆసియాన్‌ గ్రూపుతో కలిసి పనిచేయడానికి కట్టుబడి వుందని చెప్పారు. ''21వ శతాబ్ద ఆసియా శతాబ్దం. ఇది మన శతాబ్దం. ఇందుకోసం, మానవాళి సంక్షేమం కోసం కోవిడ్‌ అనంతర కాలంలో నిబంధనల ప్రాతిపదిక వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. ఆసియాన్‌, భారత్‌లు విలువలను, ప్రాంతీయ సమైక్యతను, శాంతి, సౌభాగ్యాలను పంచుకుంటున్నాయని అన్నారు. మన చరిత్ర, భౌగోళికతలు ఆసియాన్‌, భారత్‌లను కలుపుతున్నాయన్నారు. బహుళ ద్రువ ప్రపంచం పట్ల మనకు గల నమ్మకం కూడా మనల్ని కలిపి వుంచుతోందన్నారు. ఈనాడు అంతర్జాతీయంగా ఆనిశ్చితులు నెలకొన్నప్పటికీ ప్రతీ రంగంలోనూ మన పరస్పర సహకారంలో పురోగతి సాధిస్తునే వున్నామన్నారు. బహుళ నమూనాలతో కూడిన అనుసంథానతను ఏర్పాటు చేయాలని, ఆగేయాసియా, భారత్‌, పశ్చిమాసియా, యూరప్‌లను అనుసంథానిస్తూ ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. సముద్ర జలాల సహకారంపై, ఆహార భద్రతపై రెండు సంయుక్త ప్రకటనలు సదస్సులో ఆమోదించారు. డిజిటల్‌ పరివర్తన, ఆర్థిక అనుసంథానత రంగాల్లో సహకారంపై దృష్టి కేంద్రీకరించేందుకు ఆసియాన్‌-భారత్‌ నిధిని ఏర్పాటు చేయడం కూడా మోడీ చేసిన ప్రతిపాదనల్లో వుంది. ఆసియాన్‌, తూర్పు ఆసియా ఆర్థిక పరిశోధనా సంస్థను పునరుద్ధరించేందుకు మద్దతునివ్వడంపై ప్రకటన చేయాలని మోడీ కోరారు.