Jun 05,2023 21:39
  • షాంగ్రిలా డైలాగ్‌ సదస్సులో చైనా రక్షణ మంత్రి

బీజింగ్‌ : సింగపూర్‌లో జరుగుతున్న 20వ ఐఐఎస్‌ఎస్‌ షాంగ్రిలా డైలాగ్‌లో భద్రతాపరమైన అంశాలపై చైనా తన దార్శనికతను స్పష్టంగా తెలియజేసింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అనుసరిస్తును ఘర్షణాయుత వైఖరికి విరుద్ధంగా వాస్తవ, సుస్థిర భద్రతతో కూడిన తనదైన పంథాను వివరించింది. సదస్సులో చైనా స్టేట్‌ కౌన్సిలర్‌, రక్షణ మంత్రి లీ షాంగ్ఫూ మాట్లాడుతూ, చైనా ఉమ్మడి, సమగ్ర, సహకార, సుస్థిర భద్రతా దార్శనికతను వివరించారు. ఘర్షణలకు బదులుగా భద్రతపై చర్చలు జరిపే కొత్త పంథాను అనుసరించడం, పొత్తులకు బదులుగా భాగస్వామ్యాలు వహించడం, అందరికీ సమాన అవకాశాలు అన్నది చైనా విధానంగా వుందని చెప్పారు. 'చైనా నూతన భద్రతా చొరవలు' అను అంశంపై ప్రసంగిస్తూ ఆయన, చైనా ప్రతిపాదించిన గ్లోబల్‌ సెక్యూరిటీ ఇనీషియేటివ్‌ (జిఎస్‌ఐ)ను అమలు చేయాలంటే బెదిరింపులు, గుత్తాధిపత్యం బదులుగా పరస్పర గౌరవం నెలకొనాలని సూచించారు. న్యాయం, పారదర్శకత వుండాలన్నారు. పరస్పర విశ్వాసం, సంప్రదింపులతో ఘర్షణల పంథాను విడనాడాలన్నారు. అందరినీ కలుపుకునిపోవడం, అరమరికలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించే ధోరణితో ఘర్షణలను నివారించాలని అన్నారు. ఆసియా-పసిఫిక్‌ కమ్యూనిటీ పట్ల తమకుగల నిబద్ధతతో అనిు పక్షాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా వుందన్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతకు మరింత మెరుగైన అవకాశాలను అనుసరిస్తూ, ప్రాంతీయ భద్రతా సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి కృషి చేస్తామన్నారు. బలమైన భద్రతా, విశ్వాస పునరుద్ధరణా వ్యవస్థలను నిర్మించడం, మరింత సమానమైన భద్రతా నిబంధనలను పెంపొందించడం, బహుముఖ భద్రతా యంత్రాంగాలను మెరుగుపరచడం, సమర్ధవంతమైన రక్షణ, భద్రతా సహకారాన్ని కొనసాగించడం తమ దార్శనికతలో కీలకాంశాలని లీ పేర్కొన్నారు. చైనా ఆధునీకరణ అనేది అత్యంత శక్తివంతమైన అభివృద్ధి సాధనంగా వుందని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచ శాంతి పరిరక్షణకు, అంతర్జాతీయ పాలనను మెరుగుపరచడానికి ఇది దోహదపడుతుందన్నారు.