జకార్తా : ఆగ్నేయాసియా దేశాలతో సోదర సంబంధాలు కొనసాగించేందుకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని చైనా ప్రధాని లీ కియాంగ్ చెప్పారు.ఈ ప్రాంత దేశాల మధ్య ఏదైనా వివాదం వుంటే దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవచ్చని, ప్రచ్ఛన్న యుద్ధానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారమివ్వరాదని ఆయన ఉద్బోధించారు. ఆసియాన్ శిఖరాగ్ర సదస్సుకు అతిధి హౌదాలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లీ కియాంగ్ మాట్లాడుతూ, కోవిడ్ వంటి క్లిష్ట సవాల్‌ను ఎదుర్కోవడంలో ఒకరికొకరం సహకరించుకున్నామని, ఆసియాన్‌తో సోదర సంబంధాలకు ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు. ఏవైనా వివాదాలు, విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. గ్లోబల్ సూపర్ పవర్‌గా చైనా ఎదుగుదలను అడ్డుకునేందుకు అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వంతో వ్యవహరిస్తోందని లీ కియాంగ్ విమర్శించారు.
అమెరికా కుయుక్తులకు చెక్
గత నెలలో చైనా విడుదలజేసిన కొత్త మ్యాప్ పైన, అలాగే దక్షిణ చైనా సముద్ర దీవులపై పొరుగుదేశాలను ఎగదోసేందుకు అమెరికా చేసిన యత్నాలను ఫిలిప్పీన్స్ తిరస్కరించింది.' రెండు శక్తివంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక పోటీ లెన్స్ ద్వారా దక్షిణ చైనా సముద్ర వివాదాన్ని చూడలేం. ఇందుకు సంబంధించి తప్పుదారి పట్టించే కథనాలను ఫిలిప్పీన్స్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది,' అని ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండో మార్కోస్ జూనియర్ తేల్చి చెప్పారు.
ఈ సదస్సుకు అతిధి హౌదాలో హాజరైన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దక్షిణ చైనా సముద్ర దీవుల వివాదాన్ని ఆసరా చేసుకుని చైనాకు వ్యతిరేకంగా ఆసియాన్ దేశాలను ఎగదోసే యత్నం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాల భౌగోళిక సమగ్రత పరిరక్షణకు అమెరికా మద్దతు ఉంటుందని ఆమె అన్నారు.
ఆసియాన్ డిక్లరేషన్ ఆమోదం
ప్రపంచవ్యాపితంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో 43వ ఆసియాన్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. గురువారంతో ముగిసిన ఈ మూడు రోజుల సదస్సులో ఆసియాన్ నాయకులు ఒక డిక్లరేషన్‌ను ఆమోదించారు. పలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తదుపరి ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు 2024లో లావోస్‌లో జరుగుతుంది. మయన్మార్‌లో నాలుగు వేల మందిని చంపి, వేలాది మందిని నిర్బంధించిన మయన్మార్ సైనిక ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా 2021లో ఆసియాన్ ఆమోదించిన అయిదు అంశాల తీర్మానం అమలులో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల ఆగేయాసియా దేశాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.వాతావరణ మార్పులపై ప్రాంతీయ కర్బన ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ముగింపు కార్యక్రమంలో ఇండొనేషియా అధ్యక్షుడు మాట్లాడుతూ, ఆసియాన్ లక్ష్యాలను సాధించేందుకు మరింత కృషి చేయాలన్నారు.